Revanth Reddy: కొడంగల్‌ను ‘బంగారు తునక’గా మారుస్తాం
Revanth Reddy: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. 2027 నాటికి ఎడ్యుకేషన్ హబ్, కృష్ణా జలాలు, పారిశ్రామిక పార్కుల ద్వారా కొడంగల్‌ను బంగారు తునకగా మారుస్తామని హామీ ఇచ్చారు.
Revanth Reddy: కొడంగల్‌ను ‘బంగారు తునక’గా మారుస్తాం
Revanth Reddy: తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా, ఒక ‘బంగారు తునక’గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు.
కొడంగల్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కేవలం తెలంగాణకే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు కూడా 'పేదల తిరుపతి'గా విరాజిల్లుతోందని సీఎం అన్నారు. తిరుమలలో జరిగే ఆగమశాస్త్ర పద్ధతుల్లోనే ఇక్కడ కూడా పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే నందారం సూర్యనారాయణ, ఆగమశాస్త్ర సలహాదారులు సుందరవరదాచార్యుల సేవలను ఆయన స్మరించుకున్నారు.
రాబోయే ఏడాదిన్నర కాలంలో కొడంగల్ రూపురేఖలు మారిపోతాయని సీఎం స్పష్టం చేశారు. మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి, రాష్ట్రావ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడికి వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. లగచర్ల దగ్గర 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, రాబోయే ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని, తద్వారా స్థానికులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి, కృష్ణా జలాలతో కొడంగల్ భూములను తడుపుతామని హామీ ఇచ్చారు.
"2009లో మీరు నాటిన మొక్క ఈరోజు మహావృక్షమై ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. ఈ చెట్టును మీరే కాపాడుకోవాలి" అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. సర్పంచులు ఏ పార్టీ వారైనా సరే, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. 2027 డిసెంబర్ నాటికి నియోజకవర్గంలోని అన్ని పనులు పూర్తి చేయడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




