Telangana: మిల్లెట్ ఇడ్లీలు.. ఉప్మా.! ఇంటర్ విద్యార్ధులకు అద్దిరిపోయే బ్రేక్‌ఫాస్ట్..

Telangana: పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం.

Ravi
By Ravi
Published on: 28 May 2026 11:04 AM IST
Telangana
X

Telangana: మిల్లెట్ ఇడ్లీలు.. ఉప్మా.! ఇంటర్ విద్యార్ధులకు అద్దిరిపోయే బ్రేక్‌ఫాస్ట్..

Telangana: ఉదయం నిద్రలేవగానే కాలేజీకి వెళ్లాలనే హడావిడిలో చాలామంది పిల్లలు సరిగ్గా టిఫిన్ చేయకుండానే పరిగెడుతుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థుల పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఉదయమే పనులకు వెళ్లిపోతే కడుపు మాడ్చుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులో కూర్చునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. సరిగ్గా పేద విద్యార్థుల ఈ కష్టాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూన్ 12 నుంచి ఇంటర్ విద్యార్ధులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు ఈ పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించనున్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతలో, రుచిలో ఏమాత్రం రాజీ పడకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. ఉదయం అల్పాహారంలో భాగంగా పిల్లలకు వేడివేడి మిల్లెట్ ఇడ్లీలు, కిచిడీ, పోహా, గోధుమ రవ్వ ఉప్మా, పొంగల్, పూరీ లాంటి రకరకాల పోషకాలతో కూడిన రుచికరమైన వెరైటీలు అందించనున్నారు. రోజు విడిచి రోజు పాలు, రాగి జావ ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో వండిన అన్నం, కమ్మటి పప్పు, సాంబారు, పోషక విలువలున్న ఆకుకూరలు, కూరగాయల వంటకాలు వడ్డించనున్నారు. దీనికి తోడుగా వారంలో నిర్ణీత రోజుల్లో ఉడికించిన గుడ్డు కూడా మెనూలో ప్రత్యేకంగా చేర్చారు. ప్రతీ రోజూ విద్యార్ధులు ఇష్టంగా తినేలా మెనూలో కొత్త మార్పులు ఉండేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ అద్భుతమైన పథకం వల్ల కేవలం ఆకలి తీరడమే కాదు ఇంకెన్నో గొప్ప ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాణ్యమైన పౌష్టికాహారం అందడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. కడుపు నిండా తింటే తరగతి గదిలో చెప్పే పాఠాలపై వారు పూర్తి ఏకాగ్రత సులభంగా పెట్టగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే కాలేజీ మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. విద్యార్థుల రోజువారీ హాజరు శాతం కచ్చితంగా భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story