Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. త్రీ లెవెల్ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Revanth Reddy: హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళికను వెల్లడించారు.
Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. త్రీ లెవెల్ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Revanth Reddy: ఆధునికీకరణ, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై కీలక ప్రసంగం చేశారు.
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్:
ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి కలిగించేందుకు 'సిగ్నల్ ఫ్రీ సిటీ' ప్రణాళికను అమలు చేయబోతున్నామని సీఎం తెలిపారు. దీని కోసం అండర్‌పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ (Three-Level Method) అనే త్రీ లెవల్ విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేవలం రోడ్ల విస్తరణతో సమస్య పరిష్కారం కాదని, మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మరియు మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిని మూడు ప్రధాన భాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు.
క్యూర్ (CURE): ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా అభివృద్ధి చేస్తారు.
ప్యూర్ (PURE): ORR బయట మరియు రీజినల్ రింగ్ రోడ్డు (RRR) లోపల ఉన్న ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం) హబ్‌గా మారుస్తారు.
రేర్ (RARE): RRR కు ఆవల ఉన్న ప్రాంతాన్ని అగ్రికల్చర్ (వ్యవసాయ) సెక్టార్‌గా గుర్తించి అభివృద్ధి చేస్తారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరిట మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణీకరణ వల్ల భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన మార్గమని సీఎం పునరుద్ఘాటించారు.




