Revanth Reddy: రేవంత్ రెడ్డి చిట్‌చాట్: హైడ్రా దెబ్బకు కబ్జాదారులు గజగజ.. వైఎస్సార్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు!
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మభ్యపెట్టడం అంత ఈజీ కాదని చెప్తూ..
Revanth Reddy: రేవంత్ రెడ్డి చిట్‌చాట్: హైడ్రా దెబ్బకు కబ్జాదారులు గజగజ.. వైఎస్సార్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో పరిపాలన, విద్యా రంగ సంస్కరణలు, హైడ్రా యాక్షన్ మరియు జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మభ్యపెట్టడం ఎవరికీ సాధ్యం కాదని, పాలనలో తనకు 'కామన్ సెన్స్' అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
తాను ప్రతిరోజూ 16 నుంచి 18 గంటల పాటు శ్రమిస్తానని సీఎం తెలిపారు. "నేను కేసీఆర్ మీడియా వాళ్లను కూడా ప్రెస్‌మీట్‌కు పిలుస్తాను, వారి మైండ్‌సెట్ ఏంటో తెలుసుకుంటా. రాత్రి పూట కొందరు జర్నలిస్టులతో మాట్లాడి పాలనపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. నాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా నేను చూస్తాను, ఎందుకంటే దాని నుంచి కూడా నాకు కొంత ప్రభుత్వ సమాచారం అందుతుంది." తాను ఫుట్‌బాల్ ఆడతానని, అందుకే క్రీడల రాయబారిగా మెస్సీని తీసుకువచ్చానని.. యువతను క్రీడల వైపు మళ్లించడమే తన లక్ష్యమని రేవంత్‌రెడ్డి చెప్పారు.
హైడ్రా (HYDRAA) పనితీరును సమర్థిస్తూ సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. "పేదవాళ్లు చెరువుల పరిసరాలను ఆక్రమించుకుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్లు కూడా చెరువులను కబ్జా చేస్తే ఎలా?" అని ప్రశ్నించారు. హైడ్రా వచ్చాక ఇప్పుడు ఎవరైనా చెరువును కబ్జా చేయడానికి కనీసం ఆలోచన అయినా చేస్తారా? అని నిలదీశారు. హైడ్రా లాంటి కఠినమైన వ్యవస్థలు అన్ని రాష్ట్రాలకు అవసరం లేదని, కేవలం మెట్రోపాలిటన్ నగరాలకే ఇది అవసరమని పేర్కొన్నారు.
కులం పేరుతో హాస్టళ్లు వేరుగా పెట్టడాన్ని సీఎం తప్పుపట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: ఒకవైపు క్యాస్టిజం (కులతత్వం) వద్దు అంటూనే.. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేర్వేరు హాస్టళ్లు పెడుతున్నారు. అందుకే మేము అందరూ కలిసి చదువుకునేలా 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్' తీసుకువస్తున్నాం.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆదేశాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనిని తాత్సారం చేశాయి. తెలంగాణలో ఓబీసీ జనాభా లెక్కలను కూడా తేల్చేశాం. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు, ఇళ్ల నుంచి స్కూల్స్ వరకు ఉచిత రవాణా వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంస్కరణల వల్ల ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు పెరిగారు.
తన ఆహార్యం, రాజకీయ శైలిపై వస్తున్న కామెంట్లపై సీఎం స్పందిస్తూ.. "మా నాన్న రైతు, అందుకే మేము గోచి కడతాం, పంచెలు, దోతీలు కడతాం. మా ఆహార్యం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి ఒక తెలంగాణ వ్యతిరేకి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలతో తాము ఫ్రెండ్లీ మ్యాచ్ లాగే సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్లు, జాతీయ రాజకీయాలపై ప్రధాని మోదీ వ్యూహాలను రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. దేశంలో మహిళలను రాష్ట్రపతి, ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నిజాయితీగా ప్రయత్నించారని గుర్తుచేశారు. మోదీ మాత్రం దీనిని ఒక పొలిటికల్ ఫార్ములాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తాము నియోజకవర్గాల పెంపునకు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని.. కానీ మోదీ చేస్తున్న రాజకీయ ఆలోచనలనే వ్యతిరేకిస్తున్నామన్నారు.
తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ కేంద్ర కేబినెట్‌లో వారికి కీలకమైన మంత్రి పదవులు ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. "ఢిల్లీలో దక్షణాది ఎంపీలను సెకండ్ గ్రేడ్ పీపుల్స్ (ద్వితీయ శ్రేణి పౌరులు) లాగా చూడొద్దు అని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను" అని సీఎం రేవంత్‌రెడ్డి ముగించారు.




