Revanth Reddy: 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Revanth Reddy: తెలంగాణలో పండుతున్న 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రితో భేటీలో కోరారు.
Revanth Reddy: 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Revanth Reddy: తెలంగాణలో పండుతున్న ధాన్యం సేకరణపై స్పష్టత కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక విజ్ఞప్తులు చేశారు.
2025-26 వానాకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) పారా బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) సేకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుత 2025-26 యాసంగి (రబీ) సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భారీ దిగుబడిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన సేకరణ కోటాను పెంచాలని కోరారు.
గత పదేళ్లుగా (2014-15 ఖరీఫ్ నుండి) పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 1,468.94 కోట్ల అదనపు లెవీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 5 శాతం కంటే తక్కువ నూకలతో 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యంతో పాటు, మరో 5 లక్షల టన్నుల ముడి బియ్యం (Raw Rice) సరఫరాకు కూడా రాష్ట్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు పాఠశాలలు, అంగన్‌వాడీలకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ పంపిణీని తిరిగి ప్రారంభించాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు. దీనిపై తదుపరి చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.




