Revanth Reddy: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్!

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 2:48 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర అటవీ-పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలతో కలిసి ఆయన ఈ భేటీలలో పాల్గొన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ఎత్తు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు.

గతంలో తుమ్మిడిహెట్టిని 148 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని గుర్తుచేసిన సీఎం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా మహారాష్ట్రను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యారేజీ ఎత్తును 150 మీటర్లకు పెంచినా ముంపు ప్రాంతం 1,000 హెక్టార్ల లోపే ఉంటుందని వివరించారు. ఎత్తిపోతల (లిఫ్ట్) ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి తెలిపారు.

అంతకుముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పలు నీటిపారుదల ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన శాఖాపరమైన (ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్) క్లియరెన్సులను త్వరితగతిన మంజూరు చేయాలని ఈ సందర్భంగా చర్చించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story