Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలనం.. "మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే మా సీట్లు త్యాగం చేస్తాం!"
Revanth Reddy: మహిళా బిల్లు పేరుతో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే మహిళా కోటా అమలు చేస్తే తమ సీట్లను త్యాగం చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలనం.. "మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే మా సీట్లు త్యాగం చేస్తాం!"
Revanth Reddy: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీ తన రాజకీయ అహంకారాన్ని చాటుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోవడం బీజేపీ దురుద్దేశాలకు లభించిన ఓటమి అని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వానికి ఒక సంచలన సవాలు విసిరారు.
సీట్ల త్యాగానికి సిద్ధం:
"మహిళా రిజర్వేషన్ల అమలుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే, అవసరమైతే మా సీట్లను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మహిళా బిల్లు ముసుగులో సీట్ల పెంపు (డీలిమిటేషన్) చేపట్టి, రాజ్యాంగాన్ని మార్చాలని చూడటం సరికాదు" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని చూసిన బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆయన గుర్తు చేశారు.
సోమవారమే బిల్లు తెండి:
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చట్ట సవరణ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. "సభను గంటసేపు వాయిదా వేస్తే చట్టాన్ని సవరించగలిగే శక్తి ఉన్నప్పుడు.. సోమవారం మళ్ళీ సభను ప్రారంభించి, మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకురండి. పురుషులతో పాటు మహిళలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపట్టాలి" అని ఆయన సూచించారు.
బీజేపీ అహంకారానికి చెక్:
లోక్‌సభ ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం ఓడిపోవడం వల్ల బీజేపీ అహంకారం తగ్గుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. సీట్ల పెంపు విషయంలో ప్రజల్లో విస్తృత స్థాయి చర్చ జరగాలని, ప్రజల ఆమోదం లేకుండా ముందుకు వెళ్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా కూటమి తరఫున మహిళల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.




