Revanth Reddy : ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్.. భజన సోషల్ మీడియాకు బ్రేక్!

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రచారాలు ఆపి, జనం మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని ఆదేశించారు.

CR Reddy
Published on: 30 May 2026 9:02 AM IST
Revanth Reddy
X

Revanth Reddy

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం గాంధీ భవన్‌లో అత్యంత హాట్ హాట్‌గా సాగింది. అధికారంలోకి వచ్చామనే గర్వంతో కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిని పూర్తిగా మర్చిపోతున్నారనే సంకేతాలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఇకపై కుర్చీల్లో కూర్చుని కాలక్షేపం చేస్తే కుదరదని, కచ్చితంగా జనం మధ్యలోనే ఉండాలని తేల్చి చెప్పారు. పాలనతో పాటు పార్టీని కూడా గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, రూట్ మార్చకపోతే భవిష్యత్తు మారదు అంటూ లీడర్లకు గట్టి సిగ్నల్స్ ఇచ్చారు.

కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్‌గా ఉండాలంటే లీడర్లు గ్రౌండ్‌లో ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన భావన. అందుకే ఇకపై ప్రతి నెలలో మూడు రోజుల పాటు తానే స్వయంగా గ్రామస్థాయి కార్యకర్తలను కలిసి, వారి కోసం సమయం కేటాయిస్తానని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు కచ్చితంగా ప్రభుత్వ పనులను పక్కనబెట్టి, కేవలం పార్టీ బలోపేతం కోసమే పని చేయాలని ఆదేశించారు. మంత్రుల నుంచి మొదలుకొని కార్పొరేషన్ చైర్మన్ల వరకు ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని, ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల ఏకపక్ష వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు కేవలం సొంత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నారని, నియోజకవర్గాల్లో జమీందార్లుగా ప్రవర్తిస్తూ సొంత ప్రచారంతో డబ్బా కొట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను జనం లోకి తీసుకెళ్లడంలో దారుణంగా విఫలమవుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ కోసం కష్టపడిన పీసీసీ మాజీ అధ్యక్షులందరినీ కలుపుకొని వెళ్లాలని, వారి సలహాలు, సూచనలు కచ్చితంగా తీసుకోవాలని క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కేవలం వ్యక్తిగత భజన కోసమే వాడుకుంటున్నారని, పార్టీ సిద్ధాంతాల ప్రచారాన్ని, ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కేవలం మీ ఫొటోలు పెట్టుకోవడం కాదు.. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందుకే, సోషల్ మీడియాను పార్టీ ప్రచారానికి ఎలా సమర్థవంతంగా వాడుకోవాలో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పీసీసీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story