Revanth Reddy: దుర్గం చెరువు, తారామతి బారాదరికి గ్లోబల్ లుక్.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Revanth Reddy: తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
దుర్గం చెరువు, తారామతి బారాదరికి గ్లోబల్ లుక్.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కార్యాచరణను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని చారిత్రక, ప్రకృతి సిద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCRHRD) బోధి పెవిలియన్‌లో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఫేస్‌లిఫ్ట్ (Facelift) పై సీఎం అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. దుర్గం చెరువును దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చాలని, అలాగే తారామతి బారాదరిని మరింత ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నగరంలోని చారిత్రక మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లను అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో రీడెవలప్ చేయాలని సూచించారు.
హైదరాబాద్ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా పురానాపూల్ వంతెనను పర్యాటక రంగానికి అనుసంధానం చేయాలన్నారు. ఈ వంతెనపై పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే ఇక్కడి ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించి, కేవలం పర్యాటక కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
'టూరిజం హబ్ డెవలప్‌మెంట్' పథకం కింద వికారాబాద్‌ను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వికారాబాద్‌లోని ప్రసిద్ధ వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదాద్రి తరహాలో అద్భుతంగా పీఠభూమి నమూనాలో అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో అటవీ సంపదను, పర్యాటకాన్ని అనుసంధానిస్తూ ఎకో టూరిజం (Eco-Tourism) ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే హైదరాబాద్ చుట్టుపక్కల మరిన్ని సరికొత్త ఎకో పార్కులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
రాబోయే 'ఫ్యూచర్ సిటీ' పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో టూరిజం ప్రాజెక్టులుగా మార్చాలని, అర్బన్ ఫారెస్ట్ నమూనాలో చేపట్టే ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ (Global Investment Summit) ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమ్మిట్‌ను అత్యంత విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.




