CM Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ వరాలు.. ఇక స్కూళ్లలోనే బ్రేక్‌ఫాస్ట్, అదిరిపోయే ఎడ్యుకేషన్ కిట్

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగంలో కీలక మార్పులు ప్రకటించారు. రూ.1100 కోట్లతో ఎడ్యుకేషన్ కిట్లు, రాష్ట్రవ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం, యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

CR Reddy
Published on: 12 May 2026 6:45 AM IST
CM Revanth Reddy
X

CM Revanth Reddy 

CM Revanth Reddy : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. "ప్రభుత్వ బడులు అంటే కేవలం అనాథ శరణాలయాలు కావు.. అవి పేద బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు" అంటూ ఆయన భావోద్వేగంగా ప్రకటించారు. విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తూ, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన, పేద విద్యార్థుల కోసం సుమారు రూ.1100 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త పథకాలను వెల్లడించారు.

9 వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్

ప్రభుత్వ బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఇకపై 9 రకాల వస్తువులతో కూడిన ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్ అందనుంది. ఇందులో కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా, నోట్ పుస్తకాలు, బ్యాగులు, షూస్ వంటి నాణ్యమైన వస్తువులు ఉంటాయి. యూనిఫాం విషయంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ తెరిచిన రోజే ఒక జత, నెలాఖరు కల్లా రెండో జత డ్రెస్సులు ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఈ కిట్ల నాణ్యతలో రాజీ పడితే సరఫరా చేసే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామని సీఎం హెచ్చరించడం ఆయన చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

రాగి జావ, పాలతో పోషకాహార విందు

చదువుకోవాలంటే కడుపు నిండా తిండి ఉండాలని భావించిన ప్రభుత్వం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‎ను అమలు చేయబోతోంది. కొడంగల్‌లో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్టును ఇప్పుడు అన్ని స్కూళ్లకు విస్తరిస్తున్నారు. ఉదయాన్నే విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. దీనికి తోడు ఇప్పటికే కాస్మోటిక్ చార్జీలను 200 శాతం, డైట్ చార్జీలను 40 శాతం పెంచి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

సామాన్య విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ వసతులు కల్పించడమే లక్ష్యంగా సుమారు రూ.1011 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మొత్తం 100 నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నారు. అలాగే టీచర్ల నియామకాల్లో వేగం పెంచి, కేవలం 60 రోజుల్లో 11 వేల పోస్టులను భర్తీ చేయడమే కాకుండా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లను ఫిన్లాండ్ వంటి దేశాలకు విదేశీ శిక్షణ కోసం పంపాలని నిర్ణయించారు.

డ్ర*గ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతిజ్ఞ

జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజున గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సమక్షంలో విద్యార్థులతో ఒక భారీ ప్రతిజ్ఞ చేయించనున్నారు. మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించడం ద్వారా వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులను 15 శాతానికి పెంచుతామని భరోసా ఇచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story