Hyderabad: ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన!

Hyderabad: తెలంగాణలో మహిళా సాధికారతకు సరికొత్త అధ్యాయం లిఖిస్తూ సీఎం రేవంత్ సెక్రటేరియట్ నుండి వర్చువల్‌గా ఏకంగా 8000 ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.

Hyderabad
X

Hyderabad: ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన!

Hyderabad: తెలంగాణలో మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా నిలబెట్టే అద్భుత కార్యక్రమంగా దీనిని అభివర్ణించారు. ఒకేసారి 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని పేర్కొన్నారు.

తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, మహిళల అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందని సీఎం అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళల సంక్షేమం కోసం పని చేస్తోందని తెలిపారు. 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఇప్పటివరకు ఆ పథకం కోసం రూ.10 వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించామని వెల్లడించారు. మహిళల ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రెచ్చగొట్టినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు.

మహిళలను బస్సుల యజమానులుగా మార్చే లక్ష్యంతో 1000 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సోలార్ ఎనర్జీ రంగంలో కూడా మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామని, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. అలాగే పెట్రోల్ బంకుల నిర్వహణను కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మహిళా సంఘాల బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నామని వెల్లడించిన సీఎం, ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1390 కోట్లు చెల్లించిందని తెలిపారు. మహిళా సంఘాలు రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సీఎం, అవసరమైతే 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించారు. భవిష్యత్తులో ధాన్యం నిల్వలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అలాగే మహిళా శక్తి సూపర్ బజార్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, డీమార్ట్, బిగ్ బజార్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో సూపర్ బజార్ల కోసం ప్రభుత్వ భూములను తక్కువ ధరకు లీజుకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై కూడా సీఎం మాట్లాడారు. గతంలో ఇచ్చిన చీరలను పంట పొలాల్లో ఉపయోగించారని, కానీ ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ చీరలతో మహిళలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా చిలుకపచ్చ రంగులో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్,ఎంఎల్ ఏ లు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయ లక్ష్మి, వివిధ కార్పొరేషన్లు చైర్మన్ లు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్,ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి & సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా & శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story