Vikarabad: నకిలీ విత్తనాలపై నిఘా.. టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటుకు ఆదేశం
Vikarabad: జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులతో వ్యవసాయ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా పథకాల కోసం మే 10లోపు రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
Vikarabad: నకిలీ విత్తనాలపై నిఘా.. టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటుకు ఆదేశం
Vikarabad: 99 రోజుల పాటు చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మే 4 నుండి 8వ తేదీ వరకు నిర్వహించే రైతు వారోత్సవాలలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు రైతుగా నమోదు చేసుకొని వారిని గుర్తించి మే 10లోపు నమోదు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతు భరోసా, రైతు బంధు పథకాలు రైతులకు అందాలంటే తప్పనిసరిగా రైతు నమోదు చేపట్టాలనే విషయాన్ని రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యే విధంగా రైతులు నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి మండలంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని వారోత్సవాల్లో భాగంగా చేపట్టవలసిన అంశాలపై కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతు నమోదు ప్రక్రియకు సంబంధించి రోజు తమ నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి రైతులకు వివరిస్తూ, ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు పొందని వారిని గుర్తించి అందరికీ చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, తూనిక, తేమ యంత్రాలతో పాటు టార్పాలిన్, గోనె సంచులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సన్న రకం వరిని సాగు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, సన్న రకం వరి సాగు 30 శాతానికి చేరే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటలు, ఆయిల్ ఫాం సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. రైతులు నానో యూరియాను వాడే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. అధికంగా యూరియా వాడడం వల్ల జరిగే అనర్ధాలపై కూడా రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
విత్తన నాణ్యత , నకిలీ, అనధికారిక పత్తి విత్తనాల నియంత్రణకై జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో 'టాస్క్ ఫోర్స్ బృందాల' ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి, వ్యవసాయ అధికారి రాజరత్నం, డిహెచ్ ఎస్ఓ సత్తార్, డిసిఓ నాగార్జున, డిఎంసిఎస్ మోహన్ కృష్ణ, డిసిఎస్ఓ సుదర్శన్, డివిఏహెచ్ఓ సదానందం, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.




