Konda Surekha: కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధం..?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికపై ఖర్గే-భట్టి 40 నిమిషాల పాటు చర్చించారు.
Konda Surekha: కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధం..?
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వ్యవహారంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన సంచలన నివేదిక ఇప్పుడు ఏఐసీసీకి చేరడంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు పార్టీకి పెద్ద గండంగా మారాయి. మరోవైపు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే పట్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు క్రమశిక్షణా కమిటీ ముందుకు వెళ్లాయి.
ఏఐసీసీ వేటు వేస్తుందనే ప్రచారం జోరందుకోవడంతో, మధ్యాహ్నం హైదరాబాద్ ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కొండా సురేఖ భర్త కొండా మురళీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి చర్చలు జరిపారు.
ప్రజాభవన్ చర్చలు ముగిసిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పయనమయ్యారు. బెంగళూరులోని మల్లికార్జున ఖర్గే నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భట్టి జరిపిన భేటీలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రతిష్టే ముఖ్యం: పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని, వ్యక్తుల కంటే పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వ భద్రత ముఖ్యమని కమిటీ స్పష్టం చేసిన అంశాలను ఖర్గే పరిశీలించారు.
వేటు వేయడం వల్ల కలిగే లాభనష్టాలు, బీసీ సామాజిక వర్గ సమీకరణలు, వరంగల్ రీజియన్‌లో కొండా దంపతుల ప్రాబల్యాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటోంది. కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించడమా లేదా బహిరంగ క్షమాపణతో కఠిన హెచ్చరిక జారీ చేయడమా, చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తొలగించే అంశాలపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఎంతటి సీనియర్ నేతలైనా పార్టీ లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవనే సంకేతాన్ని పంపేందుకు ఏఐసీసీ సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుపై ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన వెలువడే అవకాశముండటంతో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.




