Crime News: బాటసింగారం మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు

Crime News:

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 March 2026 7:01 PM IST
Crime News
X

Crime News: బాటసింగారం మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బాటసింగారంలో ఒళ్ళు గగుర్పొడిచే దారుణం వెలుగులోకి వచ్చింది. వరుసకు రక్షణగా ఉండాల్సిన తమ్ముడే కాలయముడిగా మారి సొంత అక్కను అతి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మజీద్‌పూర్ చెరువులో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు పప్పురామ్ తన అక్క ప్రవర్తనపై గత కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నాడు. బావ చనిపోయిన తర్వాత అక్క చెడు తిరుగుళ్లు తిరుగుతోందని, తన మాట వినడం లేదని పప్పురామ్ భావించాడు. పలుమార్లు మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

డ్రామా ఆడి దొరికిపోయాడు:

గత నెల 28న తన అక్క బాటసింగారంలోని కిరాణా షాపుకు వెళ్లి కనిపించకుండా పోయిందని పప్పురామ్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ్ముడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, విచారణలో పప్పురామ్ మాటలకు, సాంకేతిక ఆధారాలకు పొంతన కుదరకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.

నిజం ఒప్పుకున్న నిందితుడు:

అక్కను తానే చంపానని, ఆపై ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెరువులో పడేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు మజీద్‌పూర్ చెరువు వద్దకు చేరుకుని మృతదేహ భాగాల కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story