Telangana: దసరా వేళ పాలపిట్టను బంధిస్తే జైలుకే.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
Telangana: దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన 'పాలపిట్ట'ను (ఇండియన్ రోలర్) బోళ్లలో బంధించడం, దాని రెక్కలు కత్తిరించడం వంటి క్రూరత్వానికి..
Telangana: దసరా వేళ పాలపిట్టను బంధిస్తే జైలుకే.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
Telangana: దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన 'పాలపిట్ట'ను (ఇండియన్ రోలర్) బోళ్లలో బంధించడం, దాని రెక్కలు కత్తిరించడం వంటి క్రూరత్వానికి పాల్పడవద్దని హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో పాలపిట్టలను కాపాడుకుంటూ, మూగజీవులను హింసించని రీతిలో దసరాను జరుపుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆయన కోరారు. ‘యాక్ట్ నౌ! సేవ్ పాలపిట్ట’ అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
పాలపిట్ట ఆవేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
పండుగ అంటే ఆనందం, స్వేచ్ఛ , తోటి జీవుల పట్ల కరుణ అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. దసరా శుభసమయంలో కొంతమంది వ్యాపారం కోసం రాష్ట్ర పక్షి రెక్కలు కత్తిరించి, బోళ్లలో బంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛను హరించి, అన్నపానీయాలు లేకుండా మూగజీవిని చిత్రహింసలకు గురిచేయడం వల్ల ఎవరికి ఏం మేలు జరుగుతుందని ప్రశ్నించారు. ఆ పక్షి పడే వేదనలో శుభాన్ని ఎలా చూడగలరని నిలదీశారు. నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరినప్పుడే పాలపిట్ట మన ప్రకృతికి అందం, సమాజానికి గౌరవమని, అది మన పర్యావరణ పరిరక్షకుడని, రైతుకు నిజమైన మిత్రుడని కొనియాడారు.
చట్టరీత్యా నేరం.. సమాచారం ఇస్తే చర్యలు
దసరా రోజున పాలపిట్టను చూడటం శుభసూచకమని భావించే క్రమంలో కొందరు వాటి కాళ్లను కట్టేసి, రెక్కలకు గమ్ పూసి క్రూరంగా బంధిస్తుంటారని, దీనివల్ల పక్షులు తీవ్రంగా గాయపడి మృతి చెందుతుంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా ఘటనలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను పట్టుకోవడం, విక్రయించడం లేదా ప్రదర్శించడం తీవ్రమైన నేరమని సీపీ స్పష్టం చేశారు. ఎక్కడైనా పాలపిట్టను బోనులో బంధించినట్లు కనిపిస్తే బాధ్యతాయుతమైన పౌరులుగా టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ అటవీ శాఖ కూడా ప్రజలకు ఇదే విజ్ఞప్తి చేసింది. క్రిమిసంహారకాల వాడకం, నివాస ప్రాంతాలు దెబ్బతినడం, అక్రమంగా పట్టుకోవడం వల్ల పాలపిట్టల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సాంప్రదాయం పేరిట పక్షుల ప్రదర్శనలను ప్రోత్సహించవద్దని, క్రూరత్వం లేని పండుగను జరుపుకోవాలని అటవీ శాఖ యంత్రాంగం పిలుపునిచ్చింది.




