Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు?
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలుగు రాష్ట్రాల్లో ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert
Rain Alert : నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, ఆంధ్రప్రదేశ్‌లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో ఏయే జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు?
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాజధాని హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°C వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, పిడుగుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణ తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
ఐఎండి వర్షపాత కేటగిరీలు, రాబోయే రోజుల వాతావరణం
వర్షం తీవ్రతను స్పష్టంగా తెలియజేసేందుకు ఐఎండి ఐదు కేటగిరీలను, నాలుగు రంగుల హెచ్చరికలను (రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్) ఉపయోగిస్తుంది. 2.5 నుంచి 15.5 మి.మీ ఉంటే తేలికపాటి, 15.6 నుంచి 64.4 మి.మీ ఉంటే మోస్తరు, 64.5 నుంచి 115.5 మి.మీ ఉంటే భారీ, 115.6 నుంచి 204.4 మి.మీ ఉంటే చాలా భారీ, 204.5 మి.మీ దాటితే అత్యంత భారీ వర్షంగా పరిగణిస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జూలై 31 వరకు వర్షాలు తీవ్రంగా ఉంటాయని, ఆగస్టు 5 వరకు గాలులతో కూడిన సాధారణ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఏపీలో ఆగస్టు 3, 4 తేదీల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు చెట్లు, పాత గోడలు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడకూడదని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.




