Bhatti Vikramarka: ప్రజాపాలన ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి కీలక సమీక్ష

Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 8:10 PM IST
Bhatti Vikramarka: ప్రజాపాలన ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి కీలక సమీక్ష
X

Bhatti Vikramarka: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు పై సీఎస్ కే. రామ కృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, స్థానిక అదనపు సంస్థల కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలలో ప్రజలకు అందించే సమాచారం ఒకే రీతిన ఉండాలని, ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు వివరించడంలో ఎటువంటి లోపాలు ఉండవద్దని అన్నారు. గ్రామ సభలకు వార్డు మెంబర్ నుంచి ఎంపీ మంత్రి వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు.గ్రామ సభ ముఖ్యమంత్రి సందేశం తో ప్రారంభించాలని అన్నారు. ప్రభుత్వం పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామంలో చదివి వినిపించాలని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డు, సన్న బియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి వివిధ పథకాల లబ్ధిదారుల వారు పొందుతున్న లబ్ధి గురించి మాట్లాడించాలని అన్నారు.

ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పని చేస్తుంది..

జూన్ 2 నుంచి ప్రారంభించే ఇందిరమ్మ జీవిత బీమా పథకం , ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్యక్రమం తో పాటు పాలు లేదా రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని ఆదేశించారు.సాంస్కృతిక శాఖ ద్వారా అందుబాటులో ఉన్న కళాకారులను ఉపయోగిస్తూ ప్రభుత్వ పథకాల పై విస్తృత ప్రచారం కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పని చేస్తుంది అనే భావన ప్రజలలో వచ్చేలా అధికారులు పని చేయాలని అన్నారు.

గ్రామాలకు ప్రభుత్వం భారీ ఎత్తున విడుదల చేసిన నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షిస్తూ విజయవంతంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

సీఎస్ కే.రామ కృష్ణ రావు మాట్లాడుతూ..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ సత్వర పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ ప్రోగ్రాం కు మంచి స్పందన వచ్చిందని, అదే స్పూర్తితో ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి జిల్లాలో గ్రామ సభలు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై రిపోర్టు అందించాలని కలెక్టర్ లను ఆదేశించారు. గ్రామ సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా గ్రామసభలో ఉండాలని అన్నారు.

గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజలకు వివరించాలని అన్నారు.

గ్రామ సభలో నూతన సాగు పద్ధతులు, పంట మార్పిడి విధానం, యూరియా వాడకం తగ్గించడం, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి పలు అంశాల పై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ సభ నిర్వహణకు సంబంధించిన బిల్లులు త్వరగా చెల్లింపు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ సభ తరహాలో మున్సిపాలిటీలలో వార్డులో సైతం సభలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. వార్డు సభలను పూర్తిస్థాయిలో రికార్డు చేసే ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ అందించాలని అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదించిన వివిధ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా గ్రామ, వార్డు సభలలో ప్రజలకు వివరించాలని సిఎస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో శ్రీనివాస్ డిపిఓ జగదీశ్వర్ డి ఆర్ డి ఓ శ్రీధర్ వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పలువురు అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story