Eatala Rajender: ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడను.. విమర్శకులకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్!

Eatala Rajender: కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై తనపై వస్తున్న విమర్శలకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 10 July 2026 5:37 PM IST
Eatala Rajender
X

Eatala Rajender: ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడను.. విమర్శకులకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్!

Eatala Rajender: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం విషయంలో తనపై కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని, అలాంటి చిల్లర వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.

తనపై వస్తున్న పొలిటికల్ విమర్శలకు ఈటల రాజేందర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "ఎవరో వెనక ఉండి ఆడిస్తేనో.. లేక స్క్రిప్టు రాసిస్తేనో మాట్లాడే వ్యక్తిని కాదు నేను. మేం స్వయం ప్రకాశకులం.. ఒకరు చెబితే ఆడే వ్యక్తులం అసలే కాదు. బీజేపీ ఎప్పుడూ కాళేశ్వరం సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగానే తీసుకుంది. తెలంగాణలో ప్రాజెక్టులు, జల వివక్షపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముందుండి పోరాడిన చరిత్ర నాది" అని ఈటల గుర్తుచేశారు.

వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇతరుల కంటే తనకే ఎక్కువ అవగాహన ఉందన్నట్లుగా ఈటల మాట్లాడారు. "శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) వచ్చాకే మా జిల్లాలో వ్యవసాయం గణనీయంగా పెరిగింది. అసలు కాళేశ్వరం కంటే ముందే అక్కడ జలయజ్ఞం జరిగింది. ఎస్సారెస్పీ గురించి కనీస అవగాహన ఉన్నవాళ్లకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి" అని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. వాతావరణ శాఖ నుంచి ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందించాల్సిన కనీస బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నీటి వినియోగంపై ప్రభుత్వం మొండిగా వెళ్లకుండా, వెంటనే విశ్రాంత ఇంజినీర్లతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story