AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు!
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు సృష్టించిన 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు నమోదు.
AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు!
AV Ranganath: హైదరాబాద్‌లో నకిలీ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ విపత్తు స్పందన, ఆస్తుల రక్షణ సంస్థ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ నిరభ్యంతర పత్రాలు (NOC) సృష్టించినట్లు తేలడంతో 8 ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) నుంచి అఫిలియేషన్ (గుర్తింపు) పొందేందుకు ఈ కళాశాలలు నకిలీ పత్రాలను సమర్పించినట్లు ఆధారాలతో సహా వెల్లడైంది.
ఇంటర్మీడియట్ బోర్డు అనుమతుల కోసం మొత్తం 76 ప్రైవేట్ కాలేజీలు ఫైర్ NOCలను సమర్పించగా, హైడ్రా అధికారులు నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లో 8 కాలేజీల NOCలు నకిలీవని, కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని స్పష్టమైంది.
నకిలీ పత్రాలతో ఇంటర్ బోర్డును, ప్రభుత్వాన్ని మోసగించిన ఈ 8 కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైడ్రా అడిషనల్ డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
కేసు నమోదైన 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీల జాబితా:
ప్రియాంక జూనియర్ కాలేజ్ (మెహదీపట్నం)
మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ (విద్యానగర్)
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (చంద్రాయణగుట్ట)
న్యూ ఎరా జూనియర్ కాలేజ్ (చిక్కడపల్లి)
షాహీర్ జూనియర్ కాలేజ్ (శివరాంపల్లి)
వశిష్ట జూనియర్ కాలేజ్ (తెల్లాపూర్)
హైందవి జూనియర్ కాలేజ్ (బర్కత్‌పురా)
రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ (ఎస్సార్ నగర్)
అగ్నిమాపక భద్రతా నిబంధనలను పక్కనబెట్టి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ సర్టిఫికెట్లతో అఫిలియేషన్ పొందేందుకు ప్రయత్నించిన ఈ కళాశాలల నిర్వాహకులు, దీనికి సహకరించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.




