Crime News: పూజల పేరుతో పంగనామం.. లక్షల విలువైన సొత్తుతో ముఠా పరారీ!

Crime News: పెద్దపల్లి జిల్లా మోట్లపల్లిలో పూజల పేరుతో భారీ మోసం జరిగింది. ఇంట్లో సమస్యలు తీరుస్తామని నమ్మించి గోనె లక్ష్మీ-రాజారాం దంపతుల నుంచి ₹80 వేల నగదు, బంగారం దోచుకెళ్లారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 March 2026 4:53 PM IST
Motlapalli
X

పూజల పేరుతో పంగనామం.. లక్షల విలువైన సొత్తుతో ముఠా పరారీ!

కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి): అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో బురిడీ కొట్టించే ముఠాలు మళ్లీ పంజా విసిరాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామంలో పూజల పేరుతో ఒక ఆగంతక ముఠా దంపతులను నిలువునా ముంచేసింది. ఇంట్లో సమస్యలు తొలగిస్తామంటూ నమ్మించి లక్షల విలువైన సొత్తుతో ఉడాయించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

నమ్మించి.. నట్టేట ముంచి:

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం మోట్లపల్లికి చెందిన గోనె లక్ష్మీ, రాజారాం దంపతుల ఇంటికి ఒక అపరిచిత మహిళ వచ్చింది. మీ ఇంట్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక శక్తివంతుడైన పూజారి పరిష్కరిస్తారని నమ్మబలికింది. అనంతరం సోమవారం ఒక మంత్రగాడిని వెంటబెట్టుకుని మళ్లీ వచ్చింది.

పూజలో భాగంగా ఇంట్లో ఉన్న బంగారం, నగదును బొగ్గులు, పసుపు, బియ్యంతో కలిపి ఉంచాలని, పూజ ముగిశాక తిరిగి ఇస్తామని ఆ మంత్రగాడు నమ్మించాడు. అతని మాటలు నమ్మిన దంపతులు 80 వేల రూపాయల నగదు, తులం బంగారు చైను, పావు తులం కమ్మలు అతనికి అప్పగించారు. వాటిని తీసుకున్న ఆ మాయగాడు మళ్లీ కనిపించకుండా పరారయ్యాడు. ఇదే ముఠా మరో మహిళ బందెలా కల వద్ద కూడా 'ఇంట్లో బాగు చేస్తాం' అని చెప్పి 16,000 రూపాయలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

పోలీసుల రంగప్రవేశం:

మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆగంతక ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు పూజల పేరుతో ఇంటికి వస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story