Bodhan: కదలని యంత్రాంగం తరలిపోతున్న ధాన్యం

Bodhan: బోధన్ డివిజన్ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 5:36 PM IST
Bodhan
X

Bodhan: కదలని యంత్రాంగం తరలిపోతున్న ధాన్యం

Bodhan: ఆరుగాలం కష్టించి పండించిన రైతాంగానికి ఇబ్బందులు తప్పడం లేదు. రైతులను దళారులు మోసం చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చలన రాకపోవడం గమనార్వం. బోధన్ డివిజన్ పరిధిలోని సంగం, మినార్ పల్లి, రుద్రూర్, వర్ని, రెంజల్ తదితర ప్రాంతాల్లో ఆదివారం రైతులు వరి పంటలు కోసి దిక్కుతోచని పరిస్థితుల్లో దళారులకు కట్టబెడుతున్నారు.

రాష్ట్ర అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పండించిన పంటను కౌలు రైతులు దళారి చెప్పిన ధరకు అప్పగిస్తున్నారు. క్వింటాకు రూ. 1800 నుండి19 వందల వరకు ధాన్యాన్ని దళారి కొనుగోలు చేస్తున్నాడు. 70 కిలోల బస్తాకు తేమ పేరుతో మూడు కిలోల తరుగును తీస్తూ దళారులు రైతులను మోసగిస్తున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేకపోవడంతో కౌలు రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేస్తున్నారు.

వడగండ్ల వానకు తగ్గిన దిగుబడి : ఇటీవల కూర్చున్న వడగండ్ల వానకు ఎకరాకు 50 క్వింటాల దిగుబడి రావాల్సి ఉన్నప్పటికీ వడగండ్ల వానతో 15 నుండి 20 బస్తాల వరకు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 35వేల నుండి 40,వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ తమకు పెట్టుబడి రాకపోవడంతో తాము చేసిన అప్పులను ఎలా తీర్చాలని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేధిస్తున్న పట్టాదారులు! తమ వ్యవసాయ భూములను కౌలు రైతులకు కౌలు అప్పగించిన పట్టాదారులు కౌలు రైతులు కౌలు చెల్లించాలని వేధిస్తున్నారని కౌలు రైతులు వాపోతున్నారు. కాలం కలిసి వస్తే పంటలు దిగుబడి ఆశిజనకంగా ఉంటుందని ఆశించిన కౌలు రైతులకు వడగండ్ల వాన మరింత అప్పుల ఊబిలోకి లాగిందని కౌలు రైతులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.

తెచ్చినప్పుడు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు

పంట పెట్టుబడి కోసం తెచ్చినప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కౌలు రైతు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను 35 ఎకరాల వ్యవసాయాన్ని కౌలు చేస్తున్నట్లు ఎకరాకు ఒక పంట చొప్పున 14 బస్తాల కౌలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని తాను పండించిన పంటలో ఎకరాకు 20 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చిందని రైతు పేర్కొన్నారు.

స్పందించని జిల్లా యంత్రాంగం : దళారి వ్యవస్థను కట్టడి చేయాల్సిన విజిలెన్స్ అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. దళారి వ్యవస్థను కట్టడి చేసి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.

దళారిగా అవతారం ఎత్తిన రైస్ మిల్లర్లు: డివిజన్ పరిధిలోని సంగం, మినార్పల్లి,రుద్రూర్ కోటగిరి ప్రాంతంలో కొందరు మిల్లర్లు దళారుల అవతారం ఎత్తారు. నేరుగా రైతుకల్లాల కు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతును మభ్యపెడుతూ రైతు నుండి ధాన్యాన్ని తరలిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story