Formula E Case : తెలంగాణ రాజకీయాల్లో పెను భూకంపం.. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్
Formula E Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రూ.55 కోట్ల అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకానున్నారు.
Formula E Case
Formula E Case : తెలంగాణ రాజకీయాన్ని ప్రకంపనలకు గురిచేస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ ఘట్టం నేటితో ఒక కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో దాదాపు రూ. 55 కోట్ల మేర నిధుల దుర్వినియోగం, అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 14వ తేదీన కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి సమన్లు జారీ చేయగా, నేడు విచారణ ప్రక్రియ వేడెక్కింది.
కేటీఆర్ ఏ-1.. ఈ కేసులో ప్రధాన నిందితులు వీరే
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ-1గా చేర్చారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ-2గా, హెచ్ఎమ్డీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిని ఏ-3గా, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావును ఏ-4గా, అలాగే ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బర్ట్ లొంగోను ఏ-5 నిందితుడిగా ఏసీబీ పేర్కొంది. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు మళ్లించారంటూ ఏసీబీ తీవ్ర అభియోగాలు నమోదు చేసింది.
నేడు స్వయంగా హాజరుకానున్న కేటీఆర్
కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు కేటీఆర్ ఈరోజు స్వయంగా నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 9:00 గంటలకు నగరంలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10:15 గంటల సమయంలో నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకుంటారు. విచారణ దృష్ట్యా నాంపల్లి కోర్టు ఆవరణలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, మద్దతుదారులు కోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు, బందోబస్తు చర్యలు చేపట్టారు.
అవినీతి జరగలేదు.. కేటీఆర్ క్లారిటీ
కాగా ఈ కేసుపై కేటీఆర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఎలాంటి అవినీతి లేదా అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకే పోటీలను నిర్వహించామని, నిధుల మార్పిడి అనేది హెచ్ఎమ్డీఏ నియమ నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. రాజ్యాంగం, దేశంలోని న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే ఎలాంటి భయం లేకుండా కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.




