Fuel Crisis: పెట్రోల్ కోసం బారులు.. మే 1 నుంచి ధరల మోత తప్పదా?
Fuel Crisis: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవుతోంది. మే 1 నుంచి ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో బంకుల వద్ద రద్దీ పెరిగింది. అసలు ఈ కొరతకు గల కారణాలు మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Fuel Crisis: పెట్రోల్ కోసం బారులు.. మే 1 నుంచి ధరల మోత తప్పదా?
Fuel Crisis: ఓ వైపు నెలల నిల్వలు ఉన్నాయంటున్నారు. మరోవైపు స్టాక్ లేదంటున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ.. సామాన్యులకు చుక్కలు మాత్రం కనిపిస్తున్నాయి. గంటలు, రోజుల తరబడి ఇంధనాల కోసం బంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం క్రూడాయిల్ సరఫరా లేకపోవడంతో పెట్రో కొరత ఏర్పడితే.. ఇప్పుడు షిప్‌లు భారత్‌కు చేరుకుంటున్నా.. అదే సమస్య వెంటాడుతోంది. రోడ్లపై అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.
కొరత పరిస్థితులతో వచ్చిందా..? కృత్రిమంగా వచ్చిందా అన్నది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి స్టాక్ అయిపోయిందని చెబితే రోజువారీ పనులెట్లా అన్న ప్రశ్నలతో సామాన్యుడు తలలు బాదుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయితే ఈ పెట్రో కొరత వెనుక అసలు కారణం.. స్టాక్ లేకపోవడం కాదు.. ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఐదురాష్ట్రాల ఎన్నికల్లో పోలింగ్ పూర్తవుతుంది. బెంగాల్లో రెండో విడత పోలింగ్ 29న జరగనుంది. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్‌పై రేట్ల మోత తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సమాచారంతోనే స్టాక్‌ను, సరఫరాను తగ్గించాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మే 1 నుంచి పెట్రో వాత తప్పదంటూ సోషల్ మీడియా కోడై కూస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కొద్దిరోజుల క్రితమే కేంద్ర పెట్రోలియం శాఖ క్లారిటీ ఇచ్చింది. ధరల పెరుగుదల ఉండబోదని చెప్పింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగానే కనిపిస్తున్నాయి.




