Child Marriage: అధికారుల ‘అతి’ తెలివి.. పెళ్లి కూతురు అనుకుని చెల్లిని తీసుకెళ్లారు!

Child Marriage: గద్వాల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక మైనర్ బాలికకు బాల్య వివాహం జరిగింది. పెళ్లి కూతురుకు బదులు ఆమె చెల్లిని అధికారులు తీసుకెళ్లడంతో, ఇదే అదనుగా పెద్దలు వివాహం జరిపించారు. ఐసీడీఎస్ అధికారుల నిర్వాకంపై స్థానికుల ఆగ్రహం.

Arun Chilukuri
Published on: 25 April 2026 12:56 PM IST
Child Marriage
X

Child Marriage: అధికారుల ‘అతి’ తెలివి.. పెళ్లి కూతురు అనుకుని చెల్లిని తీసుకెళ్లారు!

Child Marriage: బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అధికారుల అలసత్వం ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. కనీసం పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోకుండా, ఆధార్ కార్డు లేదా పెళ్లి పత్రికను పరిశీలించకుండా మరొక అమ్మాయిని తీసుకెళ్లడం గద్వాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.

ధరూర్ మండలానికి చెందిన ఒక యువకుడికి, గద్వాలకు చెందిన మైనర్ బాలికకు వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా, బుధవారం రాత్రి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు గద్వాల మండలంలోని సదరు గ్రామానికి చేరుకున్నారు. అయితే అధికారులు వస్తున్నారన్న విషయం ముందే తెలుసుకున్న కుటుంబ సభ్యులు, మైనర్ అయిన పెళ్లి కూతురును అక్కడి నుంచి దాచిపెట్టారు.

గ్రామానికి వచ్చిన ఐసీడీఎస్ మరియు పోలీసు సిబ్బంది అక్కడ ఉన్న పెళ్లి కూతురు చెల్లిని చూసి, ఆమెనే వధువు అని భావించారు. కనీసం ఆమె వివరాలు గానీ, గుర్తింపు కార్డులు గానీ చెక్ చేయకుండానే ఆ చిన్నారిని అదుపులోకి తీసుకుని సంరక్షణ కేంద్రానికి తరలించారు. పెళ్లి ఎలాగైనా జరగాలన్న ఉద్దేశంతో బాలిక తల్లిదండ్రులు కూడా చిన్నమ్మాయిని తీసుకెళ్తున్నా మౌనంగా ఉండిపోయారు.

అధికారులు చిన్నమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయిన వెంటనే, పెద్దలు ఆ మైనర్ బాలికను గుడికి తీసుకువెళ్లి వివాహం జరిపించారు. ఈ విషయం ఆలస్యంగా ఉన్నతాధికారులకు తెలియడంతో గద్వాల అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో బృందాలు తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే వధూవరులు అక్కడి నుంచి పరారయ్యారు.

ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా, కనీస అవగాహన లేకుండా విధులు నిర్వహించి ఒక మైనర్ బాలిక వివాహానికి పరోక్షంగా కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story