Nitu Bai: 30 కేసులు.. 9 ఏళ్లుగా అక్రమ దందా.. చివరకు ఈగల్ ఫోర్స్‌కు చిక్కిన నీతూ భాయ్

Nitu Bai: తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు చిక్కిన గంజాయి క్వీన్ నీతూ భాయ్. 9 ఏళ్లుగా అక్రమ రవాణా, 13 కేసుల్లో పరారీలో ఉన్న నిందితురాలి అరెస్ట్.

Arun Chilukuri
Published on: 7 Nov 2026 5:23 PM IST
Nitu Bai
X

Nitu Bai: 30 కేసులు.. 9 ఏళ్లుగా అక్రమ దందా.. చివరకు ఈగల్ ఫోర్స్‌కు చిక్కిన నీతూ భాయ్

Nitu Bai: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో కోట్లాది రూపాయల గంజాయి దందా నడుపుతున్న లేడీ గ్యాంగ్‌స్టర్, ‘గంజాయి కింగ్‌పిన్’ నితు బాయి (నీతూ భాయ్) ఆటను తెలంగాణ ప్రత్యేక ఈగల్ ఫోర్స్ బృందం ముగించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా సాగిస్తున్న నిందితురాలిని అధికారులు వ్యూహాత్మకంగా అరెస్టు చేశారు. ఇప్పటివరకు నిందితురాలిపై ఎన్డీపీఎస్, ఎక్సైజ్ చట్టాల కింద 30కి పైగా తీవ్రమైన కేసులు నమోదు కాగా, ఏకంగా 13 ప్రధాన కేసుల్లో గత కొన్ని ఏళ్లుగా పరారీలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది.

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంగణాలను కేంద్రంగా చేసుకుని నీతూ భాయ్ తన గంజాయి నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈమె గంజాయి విక్రయాల దందాను నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఈగల్ ఫోర్స్ బలగాలు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుంచి రూ.1,59,500 నగదును స్వాధీనం చేసుకున్నాయి.

అంతేకాకుండా, అక్రమ గంజాయి దందా ద్వారా సంపాదించిన నల్లధనంతో లంగర్‌హౌజ్, గచ్చిబౌలి మరియు నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన బినామీ ఆస్తులను, భవనాలను కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా ముమ్మర ఆరా తీస్తున్నారు. నిందితురాలికి సంబంధించిన అనేక బ్యాంకు ఖాతాలపై ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టి, లావాదేవీలను నిలిపివేసింది. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర ముఠా సభ్యులను మరియు సరఫరాదారులను కనుగొనేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.