Ghatkesar: భర్త వేధింపులే కారణమన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు!
Ghatkesar: ఘట్‌కేసర్ కెపిఆర్‌ఐటి కళాశాల భవనం నుంచి పడి గాయపడిన విద్యార్థిని పల్లవి మృతి; భర్త వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ.
Ghatkesar: భర్త వేధింపులే కారణమన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు!
Ghatkesar: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్‌లో ఉన్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కె.పి.ఆర్.ఐటీ)లో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది.
కళాశాల భవనం నుంచి పడి తీవ్రంగా గాయపడిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని పల్లవి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. కళాశాల భవనం నుంచి పడిపోవడంతో పల్లవికి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే కళాశాల సిబ్బంది ఆమెను జోడిమెట్లలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో రాత్రి 10 గంటల తర్వాత పల్లవి మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకర ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల అనుమానాలు
యాదాద్రి-భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన పల్లవికి బోడుప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటూ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బద్దం శ్రీకాంత్‌రెడ్డితో ఆమెకు ఆగస్టు 30న వివాహం జరిగింది.
వివాహం ముందు నుండి అనంతరం వరకు సుమారు నెల రోజుల పాటు పల్లవి కళాశాలకు వెళ్లలేదని, ఈ నెల 17న తిరిగి తరగతులకు హాజరైనట్లు ఆమె తల్లి సంధ్య పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లిన పల్లవి సాయంత్రం 4.30 గంటల సమయంలో భవనం నుంచి పడిపోయినట్లు కళాశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
అప్పటికే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కళాశాలలో జరిగిన ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా దర్యాప్తు చేయాలని పల్లవి తల్లి సంధ్య పోలీసులను కోరినట్లు తెలిసింది. భర్త వేధింపులు ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.
భర్త వేధింపులపై దర్యాప్తు
కాగా, పల్లవి ఆత్మహత్యకు పాల్పడటానికి భర్త శ్రీకాంత్‌రెడ్డి వేధింపులే కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కట్నం, కానుకల విషయంలో భూమి ఇవ్వాలని పల్లవిపై ఒత్తిడి, వేధింపులు చేసినట్లు ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వేధింపులతో మనస్తాపానికి గురైన పల్లవి కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఘటనకు దారితీసిన పూర్తి విషయాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




