Rythu Bharosa : తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. ఆ రోజే ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల 22న విడుదల చేయనుంది. మూడు విడతల్లో మొత్తం రూ.9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు.

CR Reddy
Published on: 16 March 2026 6:50 AM IST
Rythu Bharosa
X

Rythu Bharosa 

Rythu Bharosa : తెలంగాణ అన్నదాతల నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా(Rythu Bharosa) నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలని, ఈ నెల 22వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం స్వయంగా బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా, అదే సమయంలో రైతులకు సకాలంలో సాయం అందేలా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మొత్తం నిధులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT) ఈ నగదు జమ కానుంది.

తొలి విడతలో భాగంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక ఎకరం వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 22న రూ.3,590 కోట్లు చేరనున్నాయి. ఈ విడత పూర్తయిన సరిగ్గా 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేస్తారు. రెండో దశలో సుమారు రూ.2,650 కోట్లను పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఆర్థిక తోడ్పాటు అందనుంది.

ఇక ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా ఇచ్చేసి, ఈ సీజన్ రైతు భరోసా ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. మొత్తంగా మూడు విడతల్లో కలిపి సుమారు రూ.9,000 కోట్లు రైతుల చేతికి అందనున్నాయి. గతంలో నిధుల విడుదల ఆలస్యమవడంతో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ లోపే పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతు కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

CR Reddy

CR Reddy

Next Story