Adi Srinivas: కేసీఆర్ ఒక్క ‘రైతుబంధు’ ఇచ్చి అన్నీ ఆపేశారు.. మేం బోనస్ ఇస్తున్నాం
Adi Srinivas: బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యానికి బోనస్ ఇస్తోందని, 8 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కేసీఆర్ అహంకార ధోరణి వీడాలని ఆయన హితవు పలికారు.
Adi Srinivas: కేసీఆర్ ఒక్క ‘రైతుబంధు’ ఇచ్చి అన్నీ ఆపేశారు.. మేం బోనస్ ఇస్తున్నాం
Adi Srinivas: రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరియు కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరికి బోనస్ ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు ఎప్పుడైనా వచ్చిందా అని ఆయన నిలదీశారు.
"సారు బయటకు రారు.. ఎవరినీ కలవరు" అని స్వయంగా కేసీఆర్ కుమార్తె (కవిత) గతంలో అన్న విషయాన్ని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. రాష్ట్ర రైతులను పట్టించుకోని కేసీఆర్, పక్క రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారని విమర్శించారు. ఏ రైతునూ కలవని కేసీఆర్‌కు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో తరుగు పేరుతో రైతులను విచ్చలవిడిగా దోపిడీ చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఏటా రైతులకు కేవలం రూ. 2,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, కానీ తమ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యానికి బోనస్‌గా రైతుల ఖాతాల్లో రూ. 3,000 కోట్లు జమ చేసిందని వివరించారు.
పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నడుపుతోంది. కేసీఆర్ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం ఆపేస్తే.. తమ ప్రభుత్వం 'రైతు భరోసా'తో పాటు అన్ని పథకాలను అమలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆత్మవిమర్శ చేసుకోకుండా, ఇంకా ప్రజలనే తప్పు పట్టడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ నేడు వరి సాగులో పంజాబ్‌ను అధిగమించిందని, రైతులకు అండగా ఉండటంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆది శ్రీనివాస్ పునరుద్ఘాటించారు.




