Harish Rao: బనకచర్లను ఎందుకు అడ్డుకోవట్లేదు?.. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్!

Harish Rao: గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాస్తోందని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 3:19 PM IST
Harish Rao
X

Harish Rao: బనకచర్లను ఎందుకు అడ్డుకోవట్లేదు?.. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్!

Harish Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయమైన వాటాను సాధించామని, నిధులు కేటాయించి డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్రానికి పంపామని హరీశ్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త అనుమతి కూడా సాధించలేకపోవడం శోచనీయమన్నారు.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, తెలంగాణ ప్రాజెక్టుల సమీక్ష మరియు అనుమతుల రద్దు అంశాలను సమావేశ ఎజెండాలో చేర్చడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, తక్షణమే ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ఎజెండాను మార్చాలని లేదా జిఆర్‌ఎంబీ సమావేశాన్ని పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. "సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడం లేదు. దీనివల్ల ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాలకు అందాల్సిన నీరు ఆగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంది" అని ఆయన ఘాటుగా ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా పాల్గొనని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించిన హరీశ్ రావు, తెలంగాణ నీటి హక్కులను కాపాడే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story