Harish Rao: అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు అరెస్ట్

Harish Rao: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

CR Reddy
Updated on: 7 Sept 2026 11:46 AM IST
Harish Rao
X

Harish Rao

Harish Rao: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా అసెంబ్లీ వైపు కదిలారు. అయితే మెయిన్ గేటు వద్దే భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. నల్ల చొక్కాలు, ప్లకార్డులతో సభలోకి అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పడంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కును కాలరాస్తారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

చొక్కాలు విప్పేసి హరీష్ రావు ఆందోళన

పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సభలోకి వెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన హరీష్ రావు, ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన నల్ల చొక్కాను అక్కడికక్కడే విప్పేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే వివేకానంద, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చొక్కాలు విప్పేసి కేవలం బనియన్లతోనే అసెంబ్లీ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రజాప్రతినిధులు బనియన్లతో నిరసన తెలపడం అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది.

కేటీఆర్‌కు స్వల్ప గాయాలు.. నేతల అరెస్ట్

పోలీసులు, ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన ఈ తీవ్ర తోపులాటలో కేటీఆర్ చేతికి స్వల్ప గాయమైంది. బనియన్లతో సభలోకి వెళ్లేందుకు యత్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీష్ రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలు, ఎన్నికల హామీలపై సభలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం తమను కుట్రపూరితంగా అడ్డుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి ఈ ఘటనే పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ ప్రారంభం

ఓ వైపు అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నిరసనలతో అట్టుడుకుతుండగా.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్‎ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story