Harish Rao: హిట్లర్‌ను మించిపోయిన రేవంత్ రెడ్డి అరాచకం.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు..
Harish Rao: తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పాలన హిట్లర్ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు.
Harish Rao: హిట్లర్‌ను మించిపోయిన రేవంత్ రెడ్డి అరాచకం.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు..
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెడుతూ అణచివేత ధోరణి అవలంబిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్‌ను మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు నుంచి హ్యాకర్లను రప్పించి తమ ఫోన్లు, ఇంటి ముందున్న సీసీ కెమెరాలను ప్రభుత్వం హ్యాక్ చేయిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. "కొంతమంది ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మాపై నిఘా పెడుతున్న అలాంటి అధికారులు జాగ్రత్తగా ఉండాలి. మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టం" అని ఆయన హెచ్చరించారు.
రైతుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న మన్నే క్రిశాంక్ వంటి నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. అనుముల హనుమంత రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, కేసులతో గొంతు నొక్కడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలపై రేవంత్ ఎక్కడ?
రాష్ట్రంలో రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడే లేడని హరీష్ రావు విమర్శించారు. యాసంగి పంటకు బోనస్ ఇస్తారా లేదా అన్నదానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఏసీ గదుల్లో కూర్చుంటే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. గతంలో తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతుంటే ఎక్కడికి వెళ్లారని చురకలేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సగం కాలం పూర్తి చేసుకుందని, మిగిలిన సగ కాలమైనా పద్ధతిగా పని చేయాలని, మళ్ళీ గెలిచే అవకాశం కాంగ్రెస్‌కు లేదని ఆయన జోస్యం చెప్పారు.




