Harish Rao: తెలంగాణను పాకిస్థాన్‌తో పోలుస్తారా? ఎంపీ తేజస్వీ సూర్యపై హరీశ్ రావు నిప్పులు..
Harish Rao: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్యపై హరీశ్ రావు ఆగ్రహం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.
Harish Rao: తెలంగాణను పాకిస్థాన్‌తో పోలుస్తారా? ఎంపీ తేజస్వీ సూర్యపై హరీశ్ రావు నిప్పులు..
Harish Rao: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చడంపై బీఆర్ఎస్ (BRS) డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమేనని ఆయన మండిపడ్డారు.
అమరుల త్యాగాలను అవమానించడమే!
హరీశ్ రావు తన ప్రకటనలో బీజేపీ తీరును ఎండగట్టారు. "తెలంగాణ ఏర్పాటు అనేది దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత పాక్ విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒకవేళ తెలంగాణ ఏర్పాటు పాకిస్థాన్ విభజన లాంటిదే అయితే, మరి నాడు పార్లమెంట్‌లో బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చింది?" అని హరీశ్ రావు నిలదీశారు. గతంలో ప్రధాని మోదీ కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై అనేకమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు తేజస్వీ సూర్య అదే విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
సిగ్గుచేటు.. నిశ్శబ్దంగా ఉండటం!
తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర పార్టీల ఎంపీల తీరుపై కూడా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టి, ఢిల్లీ పెద్దల ముందు వంగి ఉన్న బీజేపీ మరియు కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ పాలిట దిష్టిబొమ్మలుగా మారారని ఎద్దేవా చేశారు. "ఈరోజు లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వీ సూర్యకు చుక్కలు చూపించేవారు. తెలంగాణ పేరుతో గెలిచి, అవమానం జరుగుతున్నా నిశ్శబ్దంగా ఉండటం సిగ్గుచేటు" అని అన్నారు. బీజేపీ అధిష్ఠానం వెంటనే తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.




