Harish Rao: కోటి ఇస్తామన్న రేవంత్.. ఇచ్చింది సగమే
Harish Rao: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన కోటి రూపాయల పరిహారం హామీని నిలబెట్టుకోలేదని హరీశ్ రావు విమర్శ. అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన ప్రభుత్వ మోసం.
Harish Rao: కోటి ఇస్తామన్న రేవంత్.. ఇచ్చింది సగమే
Harish Rao: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను మరోసారి చాటుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి హరీష్‌రావు. నాడు కోటి రూపాయల సాయం అంటూ సిగాచి బాధితులను నమ్మబలికి.. అందులో సగం కూడా వారికి ఇవ్వని రేవంత్‌రెడ్డి.. నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారంటూ ట్వీట్ చేశారు. ఆ పూటకు మాటలు చెప్పడం.. ఆ తర్వాత తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని ఫైర్ అయ్యారు.
సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే.. ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ.. మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఇదంతా కంటితుడుపు చర్యేనని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందన్నారు. మాట ఇచ్చి తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ చెప్పొకొచ్చారు.
యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని ఆరోపించారు మాజీమంత్రి హరీష్‌రావు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం.. 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన 24 కోట్ల 51 లక్షలను విభజించి చూస్తే.. ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం 45 లక్షల 40 వేలు మాత్రమేనంటూ స్పష్టం చేశారు. అంటే సీఎం హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు 54 లక్షల 60 వేల రూపాయలు చొప్పున.. మొత్తంగా 29 కోట్ల 48 లక్షల రూపాయల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందన్నారు.
కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి లక్షల రూపాయలు మాత్రమే చెల్లించడం అత్యంత శోచనీయమన్నారు. ఇక ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేసి.. వాటిని అమ్మి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్‌రావు.




