Harish Rao: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు బహిరంగ లేఖ!
Harish Rao: తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
Harish Rao: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు బహిరంగ లేఖ!
Harish Rao Letter to Revanth Reddy: రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఘాటైన లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక పెద్ద అబద్ధమని, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు.
"తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా" అని గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను హరీష్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల వద్ద బస్తాకు ఒకటి, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని, ఇప్పుడు ఎవరి తోలు తీస్తారని ఆయన ప్రశ్నించారు. ఎండల్లో రైతులు ధాన్యం కుప్పల వద్ద మాడిపోతున్నా ప్రభుత్వానికి కనీసం సోయి లేకపోవడం దారుణమన్నారు.
హరీష్‌రావు లేఖలోని ప్రధాన డిమాండ్లు:
సన్న వడ్లకు బోనస్: మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే జమ చేయాలి.
పొద్దుతిరుగుడు కొనుగోళ్లు: కేంద్రం కొన్నది పావు వంతు మాత్రమేనని, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
శనగ రైతుల గోస: శనగ కొనుగోళ్లలో పెట్టిన కొర్రీల వల్ల మద్దతు ధర రూ. 5,875 ఉండగా, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ. 3,000-4,000లకే అమ్ముకుంటూ నష్టపోతున్నారని మండిపడ్డారు.
మొక్కజొన్న నిబంధనలు: ఎకరాకు కేవలం 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను తక్షణమే సడలించాలని, పండిన ప్రతి గింజా ప్రభుత్వం సేకరించాలని కోరారు.
జొన్నల కొనుగోలు: జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
"ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రైతుల పక్షాన నిలబడాలి. అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది."




