Heatwave Alert: అడుగు బయట పెట్టేముందు ఆలోచించుకోవాల్సిందే.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భానుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
Heatwave Alert: అడుగు బయట పెట్టేముందు ఆలోచించుకోవాల్సిందే.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భానుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల చిన్నపాటి చినుకులతో కాస్త ఉపశమనం లభించినా.. ఇక నుంచి పరిస్థితి పూర్తిగా మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రం కానున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నైరుతి రుతుపవనాల వార్తల మధ్య కొత్త హెచ్చరిక
ఈ నెలాఖరులో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని ఇటీవల వార్తలు రావడంతో ప్రజలు కాస్త ఊరట చెందారు. అయితే అదే సమయంలో భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మే చివరి వారానికి ముందు వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా ఉదయం మండే ఎండలు, సాయంత్రం వర్షాలు కనిపించినా.. ఇకపై అలాంటి పరిస్థితులు తగ్గి పూర్తి స్థాయిలో వేడి ప్రభావం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుంది. వచ్చే మూడు నుంచి నాలుగు రోజులలో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం సమయంలో బయట తిరగకుండా ఉండాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీలోనూ మండిపోనున్న ఎండలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండ తీవ్రత భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేడి గాలుల ప్రభావం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని మండలాల్లో వేడిగాలులు తీవ్ర స్థాయిలో వీచే అవకాశముండటంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
వడగాలులతో పాటు ఉక్కపోత కూడా
కేవలం ఉష్ణోగ్రతలే కాదు, గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత కూడా అధికంగా ఉండనుంది. దీంతో శరీరంలో నీరసం, అలసట, డీహైడ్రేషన్ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. డాక్టర్లు తరచుగా నీళ్లు తాగాలని, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు.
కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాల అవకాశాలు
ఇక మరోవైపు విదర్భ ప్రాంతం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం ప్రాంతాలు, పోలవరం పరిసరాలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల సాయంత్రం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అయితే ఇవి ఎండ తీవ్రతను పూర్తిగా తగ్గించే స్థాయిలో ఉండకపోవచ్చని స్పష్టం చేసింది.




