Weather Update: ఇళ్ల నుంచి బయటికి రావొద్దు.. ఊహించని రీతిలో ముంచెత్తబోతున్న భారీ వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Weather Update
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు భారీ వానల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో జనగామ, హన్మకొండ, వరంగల్ అలాగే మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల యంత్రాంగానికి వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది.
ఏపీలోనూ దంచికొట్టనున్న వానలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ రాబోయే రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులు తీవ్రంగా ఉండే సమయంలో ఎవరూ చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు అలాగే కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు.




