Rajya Sabha: రాజ్యసభలో కాళేశ్వరం సెగ.. కిషన్ రెడ్డి వర్సెస్ సురేష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం!

Rajya Sabha: రాజ్యసభలో కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకుందని కిషన్ రెడ్డి ఆరోపణ. విభజన హామీలపై సురేష్ రెడ్డి నిలదీత.

Arun Chilukuri
Published on: 2 April 2026 5:18 PM IST
Rajya Sabha
X

 Rajya Sabha: రాజ్యసభలో కాళేశ్వరం సెగ.. కిషన్ రెడ్డి వర్సెస్ సురేష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం!

Rajya Sabha: పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభలో తెలంగాణ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగం మరియు రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

కాళేశ్వరం ఒక ఏటీఎం: కిషన్ రెడ్డి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సురేష్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా మార్చుకుంది. ఇంజినీర్ల సలహాలు తీసుకోకుండానే లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు" అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పనికిరాకుండా పోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలే కారణమని నిపుణుల కమిటీ తేల్చిందని గుర్తుచేశారు. ఏడు మండలాల విలీనానికి ఆనాడు కేసీఆర్ అంగీకరించారని, విలీనం తర్వాత కూడా ఆయన సోనియా గాంధీ ఇంటికి వెళ్లారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష: సురేష్ రెడ్డి

కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆకాంక్షలను కేంద్రం తొక్కిపెడుతోందని ధ్వజమెత్తారు. "తెలంగాణ అనుమతి లేకుండానే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ గతంలో అన్న మాటలు తెలంగాణ ప్రజలను గాయపరిచాయి" అని పేర్కొన్నారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హామీలను కేంద్రం 12 ఏళ్లుగా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ తన స్వశక్తితో అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణ సాకారమైందని, ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా ఉందామన్నది తమ నినాదమని గుర్తుచేశారు. రాజధాని అమరావతి బిల్లు చర్చా సమయంలోనే తెలంగాణ అంశాలు కూడా తెరపైకి రావడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story