Malla Reddy University: సినిమా ఈవెంట్ కోసం వర్సిటీకి సెలవా?: మల్లారెడ్డి యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి బిగ్ షాక్!

Malla Reddy University: సినిమా ఈవెంట్ కోసం సెలవు ఇచ్చిన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు. ఎస్ఎఫ్ఐ ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన ఆచార్య బాలకిష్టారెడ్డి.

Arun Chilukuri
Published on: 30 Oct 2026 11:14 AM IST
Malla Reddy University
X

Malla Reddy University: సినిమా ఈవెంట్ కోసం వర్సిటీకి సెలవా?: మల్లారెడ్డి యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి బిగ్ షాక్!

Malla Reddy University: విద్యా సంస్థలను నిర్వహించాల్సిన విధానంపై వివాదాల్లో చిక్కుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. వర్సిటీకి అధికారికంగా సెలవు ప్రకటించి మరీ ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విద్యాసంస్థలను సినిమా ఈవెంట్లకు వేదికలుగా మార్చడంపై ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, నేతలు కిరణ్, మమత తదితరులు గురువారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎస్ఎఫ్ఐ ఫిర్యాదుపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి సానుకూలంగా స్పందించారు. వర్సిటీ తీరుపై వివరణ కోరుతూ వెంటనే నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల నగరంలోని ఎంవీఎస్‌ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా ఈవెంట్ సందర్భంగా ఓ విద్యార్థిని మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడిన ఘోర ఘటనను ఉన్నత విద్యామండలి తీవ్రంగా పరిగణించింది. విద్యాసంస్థలు, వర్సిటీలలో విద్యార్థుల ప్రాణ రక్షణ, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకరావాల్సిన అవసరం ఉందని ఛైర్మన్ వెల్లడించారు.

భద్రతా నిబంధనలతో కూడిన ప్రత్యేక బిల్లు ముసాయిదాను రూపొందించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌లకు సమర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.