Hyderabad Tragedy : విధి ఆడిన వింత నాటకం.. తండ్రికూతుళ్లను బలిగొన్న చెట్టు కొమ్మ..
Hyderabad Tragedy : హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో గుండెల్ని పిండేసే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు సంతోషంగా..
hyderabad-Tragedy
Hyderabad Tragedy : హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో గుండెల్ని పిండేసే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో భారీ వర్షం ఊహించని విషాదాన్ని నింపింది. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంతో అల్వాల్ టెలికాం కాలనీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే..?
స్థానికులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి టెలికాం కాలనీకి చెందిన సందీప్ కుటుంబానికి చెందిన కారుపై ఓ పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడింది. శనివారం ఉదయం కారుపై ఉన్న ఆ చెట్టు కొమ్మలను తొలగించేందుకు సందీప్ తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు.
కారుపై నుంచి కొమ్మలను లాగుతున్న క్రమంలో, ఆ పచ్చి కొమ్మలు పక్కనే ఉన్న హైవోల్టేజ్ విద్యుత్ తీగలకు తగిలాయి. చెట్టు కొమ్మల ద్వారా విద్యుత్ ప్రసారమవ్వడంతో తండ్రీకూతుళ్లిద్దరూ క్షణాల వ్యవధిలో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సందీప్, రితిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే ప్రమాదంలో చిక్కుకున్న భర్త, కూతురిని కాపాడేందుకు సందీప్ భార్య శ్వేత పరుగున వచ్చి ప్రయత్నించగా, ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
చిన్న వయసులోనే అనంత లోకాలకు..
మృతురాలు రితిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కూతురు, కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి ఒకే ప్రమాదంలో కన్నుమూయడం ఆ కుటుంబంలో కోలుకోలేని దెబ్బ తీసింది. ఒకే ఇంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్వేత తన భర్త, కూతురి మృతదేహాల వద్ద రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీళ్లకు గురిచేసింది.
పోలీసుల దర్యాప్తు
ప్రమాదంపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో కరెంట్ సరఫరాను నిలిపివేసి, ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం తండ్రీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, రోడ్లపై గానీ, ఇళ్ల వద్ద గానీ విరిగిపడిన చెట్లు, కరెంట్ వైర్ల జోలికి ప్రజలు స్వయంగా వెళ్లవద్దని, తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు.




