బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో తొలి అడుగు.. హైదరాబాద్‌-చెన్నై, బెంగళూరు కారిడార్ల ఎలైన్‌మెంట్‌ సర్వే వేగవంతం!

Hyderabad Bullet Train Project: హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్‌ (బుల్లెట్) రైలు కారిడార్‌ల పనుల్లో కీలక పురోగతి నమోదైంది.

Arun Chilukuri
Published on: 29 Jun 2026 9:19 AM IST
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో తొలి అడుగు.. హైదరాబాద్‌-చెన్నై, బెంగళూరు కారిడార్ల ఎలైన్‌మెంట్‌ సర్వే వేగవంతం!
X

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో తొలి అడుగు.. హైదరాబాద్‌-చెన్నై, బెంగళూరు కారిడార్ల ఎలైన్‌మెంట్‌ సర్వే వేగవంతం!

Hyderabad Bullet Train Project: మహానగరం హైదరాబాద్‌ నుంచి పొరుగున ఉన్న కీలక నగరాలైన చెన్నై, బెంగళూరులకు ప్రతిపాదించిన హైస్పీడ్‌ (బుల్లెట్‌) రైలు కారిడార్‌ల పనుల్లో తొలి అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల ఎలైన్‌మెంట్‌కు (Alignment) సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు ఊపందుకుంది. రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ, వికారాబాద్‌ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయి మార్కింగ్‌లు చేస్తూ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాయి.

రెండు ప్రధాన రూట్లలో పది రోజులుగా కసరత్తు

హైస్పీడ్ రైల్వే అధికారులు గత పది రోజులుగా రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో క్లిష్టమైన సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌ - చెన్నై కారిడార్: ఈ రూట్ శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు సాగనుంది.

హైదరాబాద్‌ - బెంగళూరు కారిడార్: ఈ కారిడార్ శంషాబాద్, షాబాద్‌ మండలాల మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లేలా సర్వే జరుపుతున్నారు.

పొలాలు, ఖాళీ స్థలాల్లో ప్రత్యేక మార్కింగ్‌లు

సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో వెళ్లే మార్గాన్ని గుర్తిస్తూ భూములపై ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేస్తున్నాయి. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మంకీస్‌గూడెం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే మార్కింగ్‌ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. రైల్వే కారిడార్‌ ఎలైన్‌మెంట్, సర్వే పాయింట్లు, మరియు భవిష్యత్తులో అవసరమయ్యే భూసేకరణ (Land Acquisition) పరిధిని గుర్తించేందుకు పొలాలు, ఇతర ఓపెన్ ప్లాట్లలో ఎరుపు-తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు.

ఏరియల్ సర్వే పూర్తి.. త్వరలోనే తుది నివేదిక

హైస్పీడ్‌ రైలు కారిడార్‌లకు సంబంధించి ప్రాథమికంగా నిర్వహించాల్సిన ఏరియల్‌ సర్వే (Aerial Survey) ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం (Feasibility Study) కొనసాగుతోంది.

ఇందులో భాగంగానే అధికారులు క్షేత్రస్థాయిలో రూట్‌ను ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. ఈ గ్రౌండ్ సర్వే పూర్తిగా ముగిసిన తర్వాత తుది ఎలైన్‌మెంట్, బుల్లెట్ రైలు స్టేషన్ల స్థానాలు (Station Locations), మరియు ఏయే గ్రామాల్లో ఎంత భూసేకరణ అవసరమవుతుందనే వివరాలపై పూర్తి స్పష్టత రానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story