CP Sajjanar: ఇలాంటి సాహసాలు నేరుగా యమపురికే చేరుస్తాయి.. వాహనదారులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

CP Sajjanar: హైదరాబాద్‌లో డివైడర్‌పై బైక్ నడుపుతూ విన్యాసాలు చేసిన యువకుడి వీడియోపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 2 July 2026 4:03 PM IST
CP Sajjanar
X

CP Sajjanar: ఇలాంటి సాహసాలు నేరుగా యమపురికే చేరుస్తాయి.. వాహనదారులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

CP Sajjanar: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. క్షణకాలం సమయం ఆదా చేసుకునేందుకు లేదా రీల్స్ పిచ్చితో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, కనీస రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకుండా, రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌పై ద్విచక్రవాహనాన్ని ఎక్కించి నిర్లక్ష్యంగా నడుపుతున్న ఒక యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.

సదరు యువకుడి ప్రమాదకర స్టంట్‌కు సంబంధించిన వీడియోను సీపీ వీసీ సజ్జనార్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వాహనదారులపై నిప్పులు చెరిగారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించడంతో పాటు వాహనదారులకు విలువైన సూచనలు చేశారు.

"సదరు యువకుడికి హెల్మెట్ లేదు, ట్రాఫిక్ నిబంధనలపై కనీస గౌరవం లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు చేయాలనే తాపత్రయం మాత్రమే కనిపిస్తోంది. రోడ్డుపై ఉండే డివైడర్లు అనేవి ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేసినవి తప్ప.. మీ ద్విచక్రవాహనాలు ర్యాంప్ వాక్ చేయడానికి కాదు. కొద్ది నిమిషాల సమయం ఆదా చేసేందుకు మీ విలువైన ప్రాణాలను పణంగా పెట్టకండి. ఇలాంటి సాహసాలు మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చవు.. నేరుగా యమపురికో లేదా ఆస్పత్రి బెడ్‌కో చేరుస్తాయి. రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత." అని సీపీ సజ్జనార్ తన పోస్టులో స్పష్టం చేశారు.

నగరంలో బైక్ స్టంట్లు, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని ప్రయాణాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. వైరల్ వీడియో ఆధారంగా సదరు వాహనదారుడిని గుర్తించి, చట్టప్రకారం భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊపేక్షించేది లేదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story