Dating App: డేటింగ్ యాప్‌లో యువతి మోసం ఫ్లాట్ అమ్మి రూ. 4.91 కోట్లు పోగొట్టుకున్న లాయర్!
Dating App: డేటింగ్ యాప్ పరిచయంతో ప్రారంభమైన సైబర్ మోసంలో హైదరాబాద్‌కు చెందిన యువ లాయర్ తన ఫ్లాట్ అమ్మేసి ఏకంగా రూ. 4.91 కోట్లు పోగొట్టుకున్నాడు.
Dating App: డేటింగ్ యాప్‌లో యువతి మోసం ఫ్లాట్ అమ్మి రూ. 4.91 కోట్లు పోగొట్టుకున్న లాయర్!
Hyderabad Cyber Scam: హాయ్.. హల్లో.. అంటూ ఆప్యాయంగా పలకరించి, ఆపై వలపు వలలోకి దింపి జీవితాలను సర్వనాశనం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఉదంతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 'అవన్నీ పచ్చి మోసాలు, బీకేర్‌ఫుల్' అంటూ ఎంత హెచ్చరిస్తున్నా కొందరు వీటి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఒక సంచలన సంఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. చట్టాలు బాగా తెలిసిన ఓ 27 ఏళ్ల యువ లాయర్ సైబర్ కిలాడీల మాయలో పడి ఏకంగా రూ. 4.91 కోట్లు పోగొట్టుకున్న వైనం డిజిటల్ ప్రపంచంలో కలకలం రేపుతోంది.
నగరానికి చెందిన ఓ యువ లాయర్‌కు డేటింగ్ యాప్ ద్వారా ఒక ప్రొఫైల్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో సాధారణంగా సాగిన చాటింగ్ క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరుకుంది. గంటల తరబడి చాటింగ్ చేస్తూ, ప్రైవేట్ వీడియో కాల్స్‌కు అలవాటు పడిన ఆ యువకుడు.. అవతలి వ్యక్తిని పూర్తిగా నమ్మి తన సున్నితమైన సమాచారం, వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసుకున్నాడు. ఇంకేముంది, అక్కడే అసలుసిసలు ట్రాప్ మొదలైంది. ఆ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. పరువు పోతుంది, కుటుంబ గౌరవం దెబ్బతింటుంది అనే తీవ్రమైన భయంతో బాధితుడు మొదట చిన్న మొత్తాలను పంపాడు. కానీ అక్కడితో ఆగని నిందితులు రోజురోజుకూ డిమాండ్లు పెంచేశారు.
బాధితుడు తన ఖాతాలోని సొమ్ముతో పాటు కుటుంబ సభ్యుల అకౌంట్ల నుంచి కూడా డబ్బులు బదిలీ చేశాడు. ఒత్తిడి తట్టుకోలేక చివరికి తన సొంత ఫ్లాట్‌ను సైతం అమ్మేసి ఆ డబ్బును సైబర్ నేరగాళ్ల పరం చేశాడు! ఇలా ఏకంగా 241 లావాదేవీల ద్వారా రూ. 4.91 కోట్లు కోల్పోయిన తర్వాత తాను ఎంత పెద్ద ఉచ్చులో చిక్కుకున్నాడో గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
డిజిటల్ యుగంలో ఒక చిన్న పొరపాటు జీవిత కాల సంపాదనను తుడిచిపెట్టేస్తుంది. ఈ మోపాల బారిన పడకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి. డేటింగ్ యాప్‌లలో ఎంత పరిచయం ఉన్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు. మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తే భయపడి డబ్బులు ఇవ్వకండి. మీరు ఒక్క రూపాయి ఇచ్చినా వారి డిమాండ్లు మరింత పెరుగుతాయే కానీ తగ్గవు. పరువు పోతుందనే భయాన్ని పక్కనపెట్టి వెంటనే ధైర్యంగా స్పందించండి.




