Delivery Boys: డెలివరీ బాయ్స్‌కు బంపర్ ఆఫర్.. జెప్టోతో తెలంగాణ ప్రభుత్వం బిగ్ డీల్

Delivery Boys: ఎండనకా వాననకా నిరంతరం భాగ్యనగర వీధుల్లో తిరిగే డెలివరీ బాయ్స్ కష్టాలకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.

CR Reddy
Published on: 10 Sept 2026 7:53 AM IST
Delivery Boys
X

Delivery Boys

Delivery Boys: ఎండనకా వాననకా నిరంతరం భాగ్యనగర వీధుల్లో తిరిగే డెలివరీ బాయ్స్ కష్టాలకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రసిద్ధ క్విక్ కామర్స్ సంస్థ జెప్టోతో కలసి ప్రాజెక్ట్ ప్రగతికి శ్రీకారం చుట్టింది. డెలివరీ భాగస్వాములకు ఉచిత ఛార్జింగ్, వైఫై, విశ్రాంతి సదుపాయాలతో అత్యాధునిక ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం వేలాది మంది యువకులు ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, ఈ-కామర్స్ ఆర్డర్లను డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఎండ, వానలను తట్టుకుంటూ పనిచేసే ఈ గిగ్ కార్మికులకు కనీస మౌలిక వసతులు దక్కడం లేదు. పనిచేసే సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నా, తాగునీరు లేదా వాష్ రూమ్స్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, వారి సంక్షేమం కోసం ఒక గొప్ప అడుగు ముందుకు వేసింది.

ప్రగతి కేంద్రాలు.. సకల సౌకర్యాలకు నిలయం

ప్రాజెక్ట్ ప్రగతి పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ విశ్రాంతి కేంద్రాల బాధ్యతలను జెప్టో సంస్థకు అప్పగించారు. మొదటి దశలో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 5 ప్రగతి కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఆ తర్వాత దశలవారీగా హైదరాబాద్ అంతటా విస్తరిస్తారు. ఈ కేంద్రాల్లో డెలివరీ బాయ్స్ కోసం స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాష్ రూమ్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఉచిత వైఫై సదుపాయాలను కల్పించనున్నారు. అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచుతారు.

అన్ని సంస్థల కార్మికులకు ఉచిత ప్రవేశం

ఈ కేంద్రాల నిర్మాణానికి అయ్యే నిధులతో పాటు రోజువారీ నిర్వహణ బాధ్యతలను జెప్టో సంస్థే పూర్తిగా చూసుకోనుంది. ఇక్కడ మరొక విశేషమైన విషయమేంటంటే.. కేవలం జెప్టో సంస్థలో పనిచేసే వారే కాకుండా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇతర ఏ క్యాబ్ లేదా డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌లో పనిచేసే గిగ్ వర్కర్ అయినా ఈ కేంద్రాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. డెలివరీ సమయంలో తరచూ మొబైల్ ఛార్జింగ్ అయిపోయి ఇబ్బంది పడే రైడర్లకు ఈ ప్రగతి కేంద్రాలు పెద్ద ఊరటగా మారనున్నాయి.

ఉచిత హెల్త్ క్యాంపులు, సామాజిక భద్రత

కేవలం విశ్రాంతి సౌకర్యాలకే పరిమితం కాకుండా, ఈ కేంద్రాల వేదికగా గిగ్ కార్మికులకు ఎప్పటికప్పుడు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. నిరంతరం పొగ, ధూళిలో ప్రయాణించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించి, లబ్ధి చేకూరేలా చూస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను వీరికి అనుసంధానించేందుకు ఈ కేంద్రాలు వేదికగా నిలుస్తాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story