Ganesh Immersion 2026: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Immersion 2026: హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న జరగనున్న గణేష్ నిమజ్జన వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Gagan kumar
Published on: 24 Sept 2026 9:27 AM IST
Ganesh Immersion 2026
X

Ganesh Immersion 2026: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Immersion 2026: భక్తిశ్రద్ధలతో కొలిచిన లంబోదరుడికి వీడ్కోలు పలికే మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణనాథుడితో పాటు బాలాపూర్ గణేశుడి నిమజ్జన వేడుకలకు ఇప్పటినుంచే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా అట్టహాసంగా సాగే ఈ శోభా యాత్రకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు.

నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. నగరవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటుండగా, ఇతర జిల్లాల నుంచి మరో 8,400 మంది పోలీసులను రప్పించి భద్రతను పటిష్టం చేస్తున్నారు.శోభాయాత్రను, నిమజ్జన ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏకంగా 24 డ్రోన్లను రంగంలోకి దించుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించిన 10,000 సీసీ కెమెరాలతో ప్రతి కదలికపై నిఘా ఉంచనున్నారు. ప్రధాన కేంద్రమైన హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా 100 హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి, హైడ్రా శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

నిమజ్జన వేళ నగరంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. అంతేకాకుండా, నగరంలోకి ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ ట్రక్కుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. నగరవాసులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తిపారవశ్యంతో సాగే ఈ మహా నిమజ్జనోత్సవంలో ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.