Hyderabad: టీ తాగుదామని కారులో తీసుకెళ్లి.. మద్యం తాగించి బిటెక్ విద్యార్థినిపై తోటి క్లాస్‌మేట్ అత్యాచారం!
Hyderabad: హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. టీ తాగుదామని కారులో తీసుకెళ్లి, మద్యం తాగించి తోటి ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.
Hyderabad: టీ తాగుదామని కారులో తీసుకెళ్లి.. మద్యం తాగించి బిటెక్ విద్యార్థినిపై తోటి క్లాస్‌మేట్ అత్యాచారం!
Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తోటి విద్యార్థిని అని కూడా చూడకుండా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్మాదిలా ప్రవర్తించాడు. నమ్మకంగా కారులో తిప్పించి, బలవంతంగా మద్యం తాగించి సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనతో పాటు ఒకే క్లాసులో చదువుతున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 14న రాత్రి ఇద్దరూ కలిసి టీ తాగడానికి కారులో దిల్‌సుఖ్‌నగర్ వెళ్లారు.
దిల్‌సుఖ్‌నగర్ నుంచి తిరిగి ఇబ్రహీంపట్నం వస్తున్న క్రమంలో ఉదయ్ మధ్యలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం కారును బీడీఎల్ (BDL) రోడ్డులోని ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ సదరు విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం మత్తులోకి జారుకున్న యువతిని నిస్సహాయ స్థితిలో ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.
మద్యం మత్తు వీడిన అనంతరం జరిగిన ఘోరాన్ని గ్రహించిన బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 17న ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నిందితుడు ఉదయ్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సోమవారం నిందితుడు ఉడుతల ఉదయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.




