Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు హైదరాబాద్‌లోనే అధికం.. దీనికి అసలు కారణం ఏంటి?
Petrol Price: పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు హైదరాబాద్‌లోనే అధికం.. దీనికి అసలు కారణం ఏంటి?
Petrol Price: పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు
తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.3.39 పెరిగింది. అలాగే డీజిల్‌పై రూ.3.26 పెరిగింది. ఈ పెంపు తర్వాత హైదరాబాద్‌లో డీజిల్ ధర లీటరుకు రూ.98.96కు చేరగా, పెట్రోల్ ధర రూ. 110కి చేరింది. ఇక ప్రీమియం ఇంధనాల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. XP100 పెట్రోల్ ధర లీటరుకు రూ.163 వరకు ఉండగా, XP95 ధర రూ.120.33గా నమోదైంది.
తెలంగాణలో అధిక వ్యాట్‌నే ప్రధాన కారణమంటున్న వ్యాపార వర్గాలు
ఇంధన ధరలు పెరగడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్ (VAT) అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ అమలులో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇవే అత్యధిక పన్నులు అని చెబుతున్నారు. ఈ భారీ పన్నుల కారణంగా హైదరాబాద్‌లో ఇంధన ధరలు ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉన్నాయని డీలర్లు పేర్కొంటున్నారు.
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ముందంజలో
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలను పరిశీలిస్తే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పెట్రోల్ ధర అత్యల్పంగా ఉంది. డీజిల్ ధరల్లో కూడా హైదరాబాదే అగ్రస్థానంలో ఉంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నగరాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజలపై ఇంధన భారం మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.
భవిష్యత్తులో మరింత పెరుగుదల ఉండొచ్చని హెచ్చరిక
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. అధిక వ్యాట్ వల్లే రాష్ట్రంలో ధరలు ఎక్కువయ్యాయని తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారితే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని ఇంధన వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.




