Hyderabad: సోషల్ మీడియాలో మీరు ఏం చేసినా తెలిసిపోతుంది.. ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన పోలీసులు
Hyderabad: సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష పోస్టులు, సైబర్ నేరాలు, ప్రజల్లో ఉద్రిక్తతలకు దారితీసే ప్రచారాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Hyderabad: సోషల్ మీడియాలో మీరు ఏం చేసినా తెలిసిపోతుంది.. ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన పోలీసులు
Hyderabad: సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష పోస్టులు, సైబర్ నేరాలు, ప్రజల్లో ఉద్రిక్తతలకు దారితీసే ప్రచారాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. “SOCEYE – సోషల్ మీడియా ఆబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ పేరుతో రూపొందించిన ఈ ఆధునిక AI ఆధారిత అప్లికేషన్‌ను తాజాగా ప్రారంభించారు.
ఈ వ్యవస్థ ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలను వేగంగా గుర్తించడం, ప్రమాదకర పోస్టులను ట్రాక్ చేయడం, సైబర్ నేరస్తులపై నిఘా పెట్టడం మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
AI టెక్నాలజీతో సోషల్ మీడియాపై నిఘా
ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడం కోసం పెద్దఎత్తున సిబ్బంది అవసరమయ్యేది. ప్రతి పోస్టును విడిగా పరిశీలించాల్సి వచ్చేది. కానీ SOCEYE ద్వారా ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్‌గా మారింది.
ఈ AI వ్యవస్థ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను రియల్ టైమ్‌లో విశ్లేషించి, ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశమున్న కంటెంట్‌ను వెంటనే గుర్తిస్తుంది. దీంతో పోలీసులు తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
పైలట్ ప్రాజెక్ట్‌లోనే భారీ ఫలితాలు
SOCEYE ప్రయోగాత్మక దశలోనే మంచి ఫలితాలు ఇచ్చిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన పురానాపుల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించిన 85 విద్వేషపూరిత, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులను ఈ వ్యవస్థ గుర్తించింది. అలాగే గుడిమల్కాపూర్ అంశానికి సంబంధించిన 126 పోస్టులను కూడా ట్రాక్ చేసింది. ఈ పోస్టులపై వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఫిర్యాదులు పంపించి, తొలగింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నగరంలో శాంతి భద్రతలు కాపాడటంలో సహాయపడిందన్నారు.
ఒకే డాష్‌బోర్డ్‌లో అన్ని వివరాలు
SOCEYEలో ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. డయల్-100 కాల్స్, ఇంటెలిజెన్స్ అలర్ట్స్, నగరంలో జరుగుతున్న ఈవెంట్లు, ఇతర సమాచారం అన్నీ ఒకే స్క్రీన్‌పై కనిపించేలా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీంతో పోలీసు అధికారులు ఒకేసారి మొత్తం పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంటుంది.
ఆటోమేటిక్ అలర్ట్స్.. ప్రమాదకర పోస్టులకు వెంటనే గుర్తింపు
ఈ AI సిస్టమ్ సోషల్ మీడియాలోని అనుమానాస్పద అకౌంట్లు, విద్వేష ప్రచారాలు చేసే హ్యాండిల్స్‌పై నిరంతరం నిఘా ఉంచుతుంది. ప్రత్యేకంగా మాదకద్రవ్యాలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు, సైబర్ బుల్లీయింగ్, స్టాకింగ్, పిల్లలపై అశ్లీల కంటెంట్ వంటి వాటిని గుర్తించేందుకు ప్రత్యేక AI మోడల్స్ పనిచేస్తాయి.
పోస్టుల తీవ్రత ఆధారంగా వాటిని హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ కేటగిరీలుగా విభజిస్తుంది. అలాగే అభ్యంతరకర పోస్టులను సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు పంపించి చర్యలు తీసుకునేలా చేస్తుంది.
ఎవరు ఎక్కువగా షేర్ చేస్తున్నారు? వెంటనే గుర్తింపు
SOCEYEలో మరో ప్రత్యేక ఫీచర్ “షేరింగ్ నెట్‌వర్క్ అనాలిసిస్”. ఒక వివాదాస్పద పోస్టును ఎవరు ఎక్కువగా షేర్ చేస్తున్నారు, ఏ అకౌంట్లు దాన్ని వైరల్ చేస్తున్నాయి అనే వివరాలను ఈ సిస్టమ్ గుర్తిస్తుంది. దీంతో గంటల తరబడి పోలీసులు మాన్యువల్‌గా పరిశీలించాల్సిన అవసరం తగ్గిపోయింది.
ప్రజల ఫిర్యాదుల ట్రాకింగ్‌కు కొత్త విధానం
హైదరాబాద్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా SOCEYE ట్రాక్ చేస్తుంది. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ ఇస్తుంది. ఫిర్యాదు వచ్చిన దశ నుంచి పరిష్కారం వరకు మొత్తం ప్రక్రియను పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాగే ఏ ప్రాంతం నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి అనే విశ్లేషణ కూడా ఈ వ్యవస్థ అందిస్తుంది.
ఈవెంట్ల సమయంలో ప్రత్యేక మానిటరింగ్
హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ర్యాలీలు, నిరసనలు, మతపరమైన ఊరేగింపులు, భారీ సభలు జరుగుతుంటాయి. ఇలాంటి ఈవెంట్ల సమయంలో SOCEYE ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈవెంట్‌కు సంబంధించిన కీలక పదాలను గుర్తించి, సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన చర్చలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తుంది. దీంతో శాంతిభద్రతలకు భంగం కలిగించే పరిస్థితులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దర్యాప్తులకు ప్రత్యేక టూల్స్
సైబర్ నేరాలు, సోషల్ మీడియా కేసులు, డిజిటల్ ఆధారాలు ఉన్న కేసుల దర్యాప్తుకు ఉపయోగపడే అనేక టూల్స్‌ను కూడా SOCEYEలో అందుబాటులో ఉంచారు. SOCMINT, OSINT వంటి ఆధునిక ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలపై మరింత లోతైన విశ్లేషణ చేయవచ్చు.
గ్లోబల్ సెర్చ్ ఫీచర్ కూడా
SOCEYEలో హైస్పీడ్ గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ కూడా ఉంది. ఒక కీలక పదం టైప్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ సోషల్ మీడియా పోస్టులను వెంటనే సేకరించే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఏ అంశం ఎలా వైరల్ అవుతోంది అనే విషయాన్ని పోలీసులు వేగంగా అర్థం చేసుకోగలుగుతారు.




