Hyderabad Weather: హైదరాబాద్‌లో మూడు రోజుల భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నగరానికి ఎల్లో అలర్ట్ జారీ.
Hyderabad Rains Alert IMD Predicts Heavy Showers
హైదరాబాద్ నగరవాసులకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాబోయే మూడు రోజుల పాటు ఉపశమనం లభించనుంది. నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మే 29 వరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశముందని తెలిపారు.
బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.
ఇక రైతులు, వ్యవసాయ కూలీలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పనులు చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, మంచిర్యాల జిల్లాలో కూడా 46 డిగ్రీలు దాటింది.
హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడినా, పగటి వేళల్లో ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతోంది. ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
వర్షాల నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గొడుగులు, రెయిన్ కోట్లు వెంట ఉంచుకోవాలని, వానలో తడిచి అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.




