ఆరున్నరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్సై సస్పెండ్!
Hyderabad: హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది.
ఆరున్నరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్సై సస్పెండ్!
Hyderabad: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ (SI) నిబంధనలను నడిరోడ్డుపై ఉల్లంఘించారు. తన ఆరున్నరేళ్ల మనవరాలికి రద్దీగా ఉండే రోడ్డుపై కారు డ్రైవింగ్ నేర్పించేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంచలన ఘటన సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీసుస్టేషన్ పరిధి గంధంగూడలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పూజారి తిరుపతి, శనివారం సాయంత్రం తన కారును (TS 07 GP 7450) తీసుకుని గంధంగూడ రోడ్డుపైకి వచ్చారు. కారు డ్రైవింగ్ సీట్లో తన ఆరున్నరేళ్ల మనవరాలిని కూర్చోబెట్టి ఆయన డ్రైవింగ్ నేర్పించడం ప్రారంభించారు.
ఆ సమయంలో రద్దీగా ఉండే రహదారిపై అంత చిన్న చిన్నారి వాహనం నడుపుతుండటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే కారును అడ్డుకుని, ఒకవేళ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఎస్సైని నిలదీశారు.
స్థానికులు ప్రశ్నించినప్పుడు సదరు ఎస్సై తప్పు తెలుసుకోకుండా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఆటోమేటిక్ కారు అని, కారు నియంత్రణ మొత్తం తన చేతిలోనే ఉంటుందని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో కారులో ఉన్న చిన్నారి.. "మా తాత ఎస్సై" అని చెప్పడంతో స్థానికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాగ్వాదం కారణంగా గంధంగూడ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అక్కడ చేరిన స్థానికుల్లో కొందరు ఈ మొత్తం ఉదంతాన్ని తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది కాస్తా విపరీతంగా వైరల్గా మారింది. నిబంధనలు అమలు చేయాల్సిన పోలీసులే ఇలా చేయడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో నార్సింగి పోలీసులు సదరు ఎస్సై పూజారి తిరుపతిపై కేసు నమోదు చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై తిరుపతిని తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




