Telangana: హైదరాబాద్ టూ చెన్నై.. ఇకపై 3 గంటలే.! ఏయే రూట్లలో వెళ్లనుందంటే.?
Telangana: హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టు రూట్ మ్యాప్‌లో అధికారులు కీలక మార్పులు చేశారు.
Telangana: హైదరాబాద్ టూ చెన్నై.. ఇకపై 3 గంటలే.! ఏయే రూట్లలో వెళ్లనుందంటే.?
Bullet Train: మన దేశంలో బుల్లెట్ రైళ్ల ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మార్చే ఈ హైస్పీడ్ రైళ్లు మన రవాణా వ్యవస్థకు మరింత బలం చేకూర్చనుంది. తాజాగా ప్రతిష్టాత్మక 'హైదరాబాద్-చెన్నై' బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌లో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక కీలకమైన మార్పును ప్రతిపాదించింది.
మొదట సిద్ధం చేసిన డిజైన్ ప్రకారం.. ఈ బుల్లెట్ రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరు మీదుగా చెన్నైకి వెళ్లాల్సి ఉంది. కానీ, ఈ పాత రూట్‌లో సాంకేతిక సమస్యలు, భూసేకరణ ఇబ్బందులు ఎదురవుతుండటంతో అధికారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ బుల్లెట్ రైలు హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ప్రారంభమై, నాగార్జునసాగర్ వైపుగా ప్రయాణించి ఏపీలోని వినుకొండ, నెల్లూరు మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. ఈ మార్పు కారణంగా తెలంగాణ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే దూరం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఎంతో సమయం, నిర్మాణ వ్యయం కూడా కలిసి రానుంది.
ఈ కొత్త అలైన్‌మెంట్ వల్ల తెలంగాణలో దాదాపు 30 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ పొడవు తగ్గుతుందని ప్రాథమిక అంచనా. అంతేకాకుండా, నాగార్జునసాగర్ లాంటి పర్యాటక ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ రావడం వల్ల భవిష్యత్తులో టూరిజం రంగం ఊపందుకోనుంది. ఈ హైస్పీడ్ రైళ్లు గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. దీనివల్ల హైదరాబాద్ నుండి చెన్నైకి కేవలం మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త రూట్‌కు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు, సాంకేతిక సాధ్యాసాధ్యాల పరిశీలన ముమ్మరంగా సాగుతోంది.




